Petro Price Hike: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో దాడులు మొదలు పెట్టాయి.
గత నెల రోజులకుపైగా కొనసాగుతున్న ఈ ఘర్షణలు ప్రపంచ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. యుద్ధానికి ముందు ఫిబ్రవరి ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు సుమారు 70 నుంచి 72 డాలర్ల మధ్య ఉండేది. అయితే దాడులు జరిగిన రోజున ధర 72. 87 వద్ద ఉంది. యుద్ధం తీవ్రం కావడంతో రోజుల వ్యవధిలోనే వంద డాలర్లను దాటిపోయింది.
క్రూడ్ ఆయిల్ ధర ఎంత పెరిగింది?
యుద్ధం ప్రభావం క్రూడ్ ధరలపై ప్రభావం చూపింది. ఫిబ్రవరిలో సుమారు 69 డాలర్లు బ్యారెల్ ధర, యుద్ధం మొదలైన వెంటనే 80-82కి చేరింది. మార్చి నెలలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరగడం, ప్రపంచ చమురు సరఫరాకు కీలకమై హూర్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. మార్చి చివరి నాటికి క్రూడ్ ధరలు 119 నుంచి 120 స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 106. 42 నుంచి 108.05 మధ్య ట్రేడ్ అవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత గత నెల రోజుల్లోనే ధరలు దాదాపు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి.
భారత్పై పెను ప్రభావం ఎందుకు ఉంది?
భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ముడి చమురు దిగుమతి దారు. మన దేశ ఇంధన అవసరాలలో దాదారు 85 శాతం నుంచి 88 శాతం వరకు విదేశీ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాం. ప్రతి రోజూ భారత్ సుమారు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ ధర పెరిగితే మన దేశ దిగుమతి బిల్లుపై ఎఫెక్ట్ పడుతోంది. బ్యారెల్ ధర ఒక డాలర్ పెరిగితే మనపై సుమారు 8, 300 కోట్ల మేర భారం పడుతుంది. ప్రస్తుతం యుద్ధం వల్ల బ్యారెల్పై సుమారు 30 డాలర్లు అదనపు భారం పడింది. అంటే మన ఆర్థిక వ్యవస్థపై ఎంతలా ఎఫెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం ఎంత?
ముడి చమురు ధరల పెరుగుదల వల్ల భారత్ ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పడుతున్న భారం అపారం. ధరల్లో వచ్చిన పెరుగుదల వల్ల ప్రతి రోజూ సుమారు 150 మిలియన్ల నుంచి 175 మిలియన్ల డాలర్ల అదనంగా ఖర్చు అవుతోంది. అంటే రూపాయల్లో చూసుకుంటే 1245 నుంచి 1450 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఏప్రిల్ 1 నాటికి లీటర్ పెట్రోల్పై 24.40 రూపాయలు , డీజిల్పై 104. 99 వరకు అండర్ రికవరీ నమోదు అవుతుంది. అంటే వాస్తవ ధరకంటే ఇంత తక్కువకు అమ్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు సుమారు 2400 కోట్ల మేర అండర్ రికవరీలను భరిస్తున్నాయి. ఇది నెలకు 37000 కోట్లకుపైగా భారాన్ని సూచిస్తోంది.
ఎన్నికల తర్వాత పెట్రో వడ్డన తప్పదా?
ప్రస్తుతం పెట్రోల్ ధరలు హైదరాబాద్్లో 107.46 రూపాయలుగా ఉంది. డీజిల్ 95.70 రూపాయలు ఉంది. అయితే ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను పూర్తిగా భర్తీ చేసుకోవాలంటే ధరలు భారీగా పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్ 120లకుపైగా పెరిగే అవకాశం ఉంది. డీజిల్ ధరలు ఏకంగా 200 రూపాయల వరకు పెంచాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ధరలు పెంచం రాజకీయంగా, ఆర్థికంగా సాధ్యం కాదు. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరిగ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కాబట్టి ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం లేదా విడతల వారీగా లీటర్కు రూపాయి నుంచి 2 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి పెంచాలనే ఒత్తిడి ప్రభుత్వంపై ఉన్నా సరే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తుందని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ అయిపోయిన మరుక్షణమే పెట్రో వాతలు ఉంటాయని ప్రజలు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తోంది. ఎంత భారాన్ని అయిన భరించడానికి ప్రభుత్వం సిద్ధమని ప్రజలపై మాత్రం భారం మోపే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేస్తోంది.
Author : Khagesh

