CNG News: పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం కలిపి ఇంధన విక్రయాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఇథనాల్ పెట్రోల్ గురించి దేశంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.
ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని, వెహికల్ పార్ట్స్ కూడా పాడైపోతాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొంత మంది పెద్ద సంఖ్యలో సిఎన్జి కార్ల వైపు చూస్తున్నారు. కేవలం పెట్రోల్-డీజిల్లోనే కల్తీ చేయవచ్చా లేదా సిఎన్జీ ఫ్యూయల్లో కూడా కల్తీ సాధ్యమేనా? సిఎన్జి గురించి కొన్ని ముక్యమైన విషయాలు ఇలా ఉన్నాయి.
సిఎన్జిలో కల్తీ చేయవచ్చా లేదా?
ఈ ప్రశ్నకు సమాధానం అవును అని చెప్పవచ్చు. సిఎన్జిలో కూడా కల్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. సిఎన్జి అనేది గ్యాస్ రూపంలో ఉంటుంది కాబట్టి, ఇందులో పెట్రోల్, డీజిల్ లాగా ఇతర పదార్థాలను కలపడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ, సిఎన్జి కార్లు నడిపే వారిని మోసగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సిఎన్జి (CNG)లో అత్యధిక పరిమాణంలో మిథేన్ గ్యాస్ ఉంటుంది. కానీ ఒకవేళ ఇందులో పరిమితికి మించి కార్బన్ డయాక్సైడ్ (CO2) లేదా నైట్రోజన్ లేదా తక్కువ నాణ్యత కలిగిన మరేదైనా గ్యాస్ను కలిపితే, అది వాహనం పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ విషయాలు గమనించాలి..
- CNG కల్తీ వల్ల వాహనం ఇంజన్కు అవసరమైనంత మేర శక్తి లభించదు.
- ఈ కారణంగా వెహికల్ మైలేజ్, పర్ఫార్మెన్స్పై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
- వెహికల్ పికప్ వీక్ అవుతుంది.
- ఇంతకుముందు సిఎన్జి నింపినప్పుడు వాహనం ఎంత దూరం వరకు వెళ్లేదో, ఇప్పుడు మైలేజీ తగ్గిపోతుంది.
EV కొనాలనుకుంటున్నారా? BaaS స్కీమ్తో లక్షల రూపాయలు ఆదా - పూర్తి జాబితా ఇదే
సిఎన్జి నింపేటప్పుడు ఈ మోసాలపై జాగ్రత్తగా ఉండండి
- సిఎన్జి నింపే సమయంలో గ్యాస్ ప్రెజర్ చాలా ముఖ్యం.
- బంక్ సిబ్బంది ప్రెజర్లో చేతివాటం ప్రదర్శిస్తే, మీటర్ పై ఎక్కువ సిఎన్జి నిండినట్లు చూపిస్తుంది
- కానీ వాస్తవానికి వెహికల్ ఫ్యూయల్ ట్యాంకులోకి అంత గ్యాస్ చేరదు.
- అంటే మీటర్పై సిఎన్జి ఎక్కువగా నిండినట్లు రీడింగ్ కనిపిస్తుంది. కానీ ట్యాంకులోకి తక్కువ గ్యాస్ వెళ్తుంది.
- అయినప్పటికీ ఇది గుర్తించకపోతే కస్టమర్ పూర్తి నగదు బంకు సిబ్బందికి చెల్లిస్తారు. కానీ దానికి బదులుగా మీ మనీకి తగ్గట్లు సిఎన్జి లభించదు. దీనివల్ల వాహనం మైలేజ్ పై ప్రభావం పడవచ్చు.
వాహనంలో నాణ్యత లేని సిఎన్జి నింపితే నష్టం!
చాలా కాలంగా వాహనంలో తక్కువ నాణ్యత కలిగిన లేదా పాడైపోయిన సిఎన్జిని వాడుతుంటే, వాహనంపై ప్రభావం పడుతుంది. దీని ప్రభావం వాహనం యొక్క పర్ఫార్మెన్స్పై పడుతుంది. వాహనం మైలేజ్ తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ఇంజన్ పవర్ గతంలోలాగ ఉండదు. దాంతో పాటు ఫ్యూయల్ సిస్టమ్, ఇంజన్లోని ఇతర భాగాలు డ్యామేజ్ అవుతాయి.
సిఎన్జి నింపేటప్పుడు నిర్లక్ష్యం వద్దు
వాహనంలో ఎప్పుడు CNG నింపినా నమ్మకమైన సిఎన్జి స్టేషన్ నుండి మాత్రమే గ్యాస్ నింపించాలి. గ్యాస్ నింపిన తర్వాత వాహనంలో ఏదైనా సమస్య కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. సమయం చూసుకుని మీ వాహనాన్ని చెక్ చేయించాలి. అవసరమైతే మీరు సిఎన్జి స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.
Author : Shankar Dukanam

