PM Modi Mann Ki Baat | న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తలెత్తిన సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన దేశ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కష్టకాలంలో భారత ప్రజలు ఐక్యంగా దేశ ప్రయోజనాల కోసం పనిచేశారని ఆదివారం (జూన్ 28, 2026) మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆయన చేసిన విజ్ఞప్తిని మన్నించి బంగారం కొనుగోలును తగ్గించుకున్నారు, విదేశీ ప్రయాణాలను తగ్గించారు. కార్‌పూలింగ్‌తో పాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ దేశ పౌరులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సామూహిక ప్రయత్నాలలో బాధ్యత, దేశం పట్ల అంకితభావం స్పష్టంగా కనిపించిందని అన్నారు.
భారత ప్రజలు ఈ ప్రపంచ సంక్షోభాన్ని చాలా బాధ్యతాయుతంగా ఎదుర్కొన్నారనిఅన్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తాను చేసిన విజ్ఞప్తిని గుర్తుచేశారు. ప్రజలు ఓ ఏడాదిపాటు బంగారం కొనుగోలు చేయవద్దని, విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని తాను కోరానట్లు గుర్తు చేసుకున్నారు. తన మాట విని ప్రజలు ఆచరించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. పౌరుల ఈ సహకారంతో కష్టకాలంలో చిన్న చిన్న చర్యలు కూడా దేశానికి పెద్ద సహకారం అందిస్తాయని స్పష్టం చేస్తుందని అన్నారు.
మేడ్ ఇన్ ఇండియా C295 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రస్తావన
ప్రధాని మోదీ ప్రజల మారిన అలవాట్లను కూడా ప్రస్తావించారు. చాలా మంది తమ ఇష్టానుసారం కార్‌పూలింగ్ ప్రారంభించారని అన్నారు. ఒకే దిశలో ప్రయాణించే ప్రజలు కలిసి ప్రయాణించడం మొదలుపెట్టారు. చాలా మంది మెట్రో, బస్సు వంటి ప్రజా రవాణా సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయత్నాలు కష్టకాలంలో దేశ ప్రజలు జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని రుజువు చేస్తాయని తెలిపారు. పెరుగుతున్న భారత ఏరోస్పేస్ సామర్థ్యం గురించి ప్రస్తావించారు. మేడ్ ఇన్ ఇండియా C295 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉదాహరణగా చెప్పారు. ఇది భారత పెరుగుతున్న శక్తికి నిదర్శనమని అన్నారు.
మేడ్ ఇన్ ఇండియా C295 ఎయిర్‌క్రాఫ్ట్ ఏరోస్పేస్ రంగంలో భారత బలమైన స్థానాన్నిచూపుతుంది. ఈ ప్రాజెక్ట్ ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థలో కొత్త అవకాశాలను సృష్టించింది. MSME రంగాన్ని సైతం బలోపేతం చేసింది. దీనితో ఆత్మనిర్భర్ భారత్ కల మరింతగా బలపడుతోంది. ఈ ప్రాజెక్ట్ ఏరోస్పేస్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు అనుసంధానమైన మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు కూడా కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఈ చొరవ హై-టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న భారత ఆత్మనిర్భరతకు పెద్ద ఉదాహరణ అని' ప్రధాని మోదీ అన్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎక్కడ వినవచ్చు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాలను తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన దేశ విదేశాలలో నివసిస్తున్న భారతీయులతో నేరుగా కనెక్ట్ అవుతారు. ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. దీని ప్రత్యక్ష ప్రసారం దూరదర్శన్ నెట్‌వర్క్‌లో చేస్తారు. దీనిని AIR News వెబ్‌సైట్, NewsOnAir మొబైల్ యాప్, AIR News, DD News, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ అధికారిక YouTube ఛానెల్‌లలో కూడా చూడవచ్చు. ఆయన పాలన, కొత్త ఆలోచనలు, ప్రజా భాగస్వామ్యం, దేశంలో మార్పులు, జాతీయ అభివృద్ధి వంటి ముఖ్యమైన అంశాలపై మన్ కీ బాత్ ద్వారా ప్రసంగిస్తారు.
Author : Shankar Dukanam

