Dailyhunt
PPF Investment Tips : పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ "ఐదో తేదీ" రూల్‌ మర్చిపోకండి!

PPF Investment Tips : పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ "ఐదో తేదీ" రూల్‌ మర్చిపోకండి!

ABP దేశం 6 days ago

PPF Investment Tips : మధ్యతరగతి ప్రజలకు అత్యంత సురక్షితమైన, నమ్మకమైన పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ టాప్ ప్లేస్లో ఉంటుంది. ప్రభుత్వ హామీ ఉండటం, పన్ను మినహాయింపు ఉండటంతో చాలా మంది ఈ విధానంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే చాలా మంది పెట్టుబడిదారులు పీపీఎఫ్ వడ్డీ గణన వెనుక ఉన్న అసలు సూత్రాన్ని గమనించకపోవడంతో చాలా నష్టపోతున్నారు. తమకు వీలైనప్పుడు డిపాజిట్ చేసి కొంత వడ్డీని కోల్పోతుంటారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన వేళ ఇన్వెస్టర్లు తమ లాభాలను ఎలా పెంచుకోవచ్చో తెలుసుకోవడం చాలా అవసరం.

వడ్డీ లెక్కింపులో ఐదో తేదీ చాలా కీలకం

పీపీఎఫ్ రూల్ ప్రకారం వడ్డీని లెక్కించేటప్పుడు ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. ప్రతి నెల ఐదో తేదీ ముగింపు, ఆ నెల చివరి రోజు మధ్య కనిష్ట బ్యాలెన్స్పై మాత్రమే వడ్డీ లెక్కిస్తారు. అంటే ఒక నెలలో ఐదో తేదీ లోపు డబ్బు డిపాజిట్ చేస్తే ఆ నెల మొత్తానికి మీకు వడ్డీ లభిస్తుంది. ఒక వేల మీరు ఐదే తేదీ తర్వాత అంటే ఆరున డిపాజిట్ చేసినా, ఆ నెలలో మీ ఖాతాలోని కనిష్ట బ్యాలెన్స్ తక్కువగా ఉంటుందని కాబట్టి ఆ నెల వడ్డీని మిస్ అవుతారు.

ఏప్రిల్ ఐదో తేదీలోపు మీరు నగదు జమ చేస్తే ఏప్రిల్ నెల వడ్డీ కూడా మీ ఖాతాలో చేరుతుంది. కానీ ఏప్రిల్ ఆరు తర్వాత జమ చేస్తే పెట్టుబడిపై వడ్డీ మే నెల నుంచి ప్రారంభమవుతుంది. ఇలా ప్రతి నెలా ఆలస్యమైతే ఏడాదికి ఒక నెల వడ్డీ చొప్పున 15 ఏళ్లు మెచ్యూరిటీ కాలంలో భారీ మొత్తాన్ని కోల్పోతారు.

రెండు మార్గాల్లో పెట్టుబడి

పెట్టుబడిదారులు పీపీఎఫ్ ఖాతా నుంచి గరిష్ట ప్రయోజనం పొందాలంటే రెండు పద్దతులు ఉన్నాయి. ఒకేసారి భారీ మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్ 5లోపు గరిష్ట పరిమితి అయిన 1.5 లక్షలను డిపాజిట్ చేయడం మంచిది. దీని వల్ల పూర్తి పెట్టుబడిపై ఏడాది పొడవునా 12 నెలల వడ్డీ వస్తుంది.

మీరు ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటే కచ్చితంగా ప్రతి నెల ఐదు లోపు డిపాజిట్ చేయాలి. దీని వల్ల ఒక్క రూపాయి వడ్డీ కూడా పోదు.

ప్రస్తుతం వడ్డీ రేట్లు

ప్రభుత్వం 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను పీపీఎఫ్ వడ్డీ రేటును 7.1శాతం వద్ద యథాతథంగా కొనసాగుతుంది. ఇది వరుసగా ఎనిమిదో త్రైమాసికంలో ఇలానే ఉంది. సెక్షన్ 80సీ కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. 15 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం నగదు పూర్తిగా పన్ను రహితం.

పీపీఎఫ్ అనేది 15ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ కలిగిన దీర్ఘకాలిక పథకం అయినప్పటికీ ఖాతా ప్రారంభించిన మూడో ఏడాది నుంచి ఆరో సంవత్సరం వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. ఏడేళ్ల నుంచి రూల్స్ ప్రకారం కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఏడాదికి కనీసం 500 నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam