BJP Vishnuvardhan Reddy Complaint Actor Prakash Raj: హిందూ సమాజాన్ని కించపరిచేలా, రాష్ట్రంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రకాశ్ రాజ్పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం సత్యసాయి జిల్లా కదిరి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరిట సమాజంలో చీలిక తెచ్చేలా మాట్లాడుతున్న ఇలాంటి శక్తుల వెనుక ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
ప్రకాశ్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం దూషణలు చేయడమే కాకుండా, పవిత్రమైన హిందూ ధర్మం, శ్రీరాముడు, దేవాలయాలపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విద్వేషపూరితమైన కథనాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ.. కేవలం రాజకీయ కక్షతోనే ప్రకాశ్ రాజ్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హిందూ సనాతన ధర్మంపై, సీఎం, డిప్యూటీ సీఎంలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ ను ప్రకాశ్ రాజ్ సమర్థించడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వివాదంలో ప్రకాశ్ రాజ్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు సీపీఐ నేత నారాయణ, సీపీఎం నాయకత్వం మద్దతుగా నిలబడటంపై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ ప్రయోజనాలకు, హిందూ సమాజ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల వెనుక ఈ పార్టీలు ఎందుకు నిలబడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశద్రోహ శక్తులకు, మత విద్వేషకులకు కొమ్ముకాయడం ఆయా పార్టీల దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు తక్షణమే తమ వైఖరిని పునఃపరిశీలించుకుని, రాష్ట్ర ప్రజలకు, హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జోసఫ్ లాంటి అరాచక శక్తులను వెనకేసుకొస్తూ, ఏపీపై కాలకేయుల తరహాలో దాడి చేస్తున్న ప్రకాశ్ రాజ్పై పోలీసులు చట్టప్రకారం కఠినమైన దర్యాప్తు జరపాలని కూటమి నేతలు కోరుతున్నారు. జర్నలిజం ముసుగులో లేదా నటుడి హోదాలో ఉంటూ సమాజంలో మత అలజడులు సృష్టించాలని చూస్తే చట్టం ఊరుకోదని హెచ్చరించారు. కదిరి పీఎస్లో నమోదైన ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Author : Raja Sekhar Allu

