Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు

Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు

ABP దేశం 2 weeks ago

YouTuber Prashna Ravan Remand | గన్నవరం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్(బచ్చలకూర జోసెఫ్)కు గన్నవరం కోర్టు రెండు వారాలపాటు జూడీషియల్ రిమాండ్ విధించింది.

జూలై 18వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు రావణ్పై కేసు నమోదుచేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ సమాజంలో విద్రోహంతో పాటు ఇతర చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి విచారించిన అనంతరం ప్రశ్న రావణ్ను ఆదివారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు.

నెల్లూరు జైలుకు ప్రశ్న రావణ్ తరలింపు

రిమాండ్ విధింపుపై ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య సుమారు గంటపాటు వాదనలు జరిగాయి. పోలీసుల తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు వాదనలు వినిపించగా, అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రశ్న రావణ్ తరఫున జడ శ్రావణ్ కుమార్ తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత గన్నవరం కోర్టు న్యాయమూర్తి ప్రశ్న రావణ్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు భారీ భద్రత నడుమ రావణ్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తే ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు 6 నెలల వరకూ టైమ్ ఉంటుంది. అంటే ఆరు నెలలు జైళ్లో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది. అదే విధంగా ఉపా చట్టంలోని Section 43D (5) ప్రకారం బెయిల్ కూడా కష్టమేనని వినిపిస్తోంది.

Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ

యూట్యూబర్ రావణ్ కేసులో సెక్షన్లపై లాయర్ ఆందోళన

యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో కోర్టులో వాదనలు ముగిశాయని, ఆయన తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. రావణ్పై ఏకంగా మరణశిక్ష పడే తీవ్రమైన సెక్షన్ల కింద ప్రభుత్వం కేసు పెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో తాను రావణ్ పక్షాన బలమైన వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో పాటు మరో 25 మంది న్యాయవాదులు వాదనలు వినిపించారని తెలిపారు. మావోయిస్ట్ నేత హిడ్మా చనిపోయినపుడు రావణ్ శ్రద్ధాంజలి ఘటించడాన్ని కూడా ప్రాసిక్యూషన్ నేరంగా పరిగణించిందని, అసలు రావణ్కు బ్రతికే హక్కే లేదనే రీతిలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్కు వర్తించని చట్టాలు రావణ్కు మాత్రమే వర్తిస్తాయా?
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వ్యాఖ్యలను జడ శ్రవణ్ కుమార్ ప్రస్తావించారు. శ్రద్ధాంజలి ఘటిస్తేనే రావణ్ నేరస్తుడు అవుతాడనే వాదనను తప్పుబడుతూ... గతంలో నక్సలిజాన్ని సమర్ధిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఉపా (UAPA) చట్టం వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. ఒకరికొక న్యాయం, ఇంకొకరికొక న్యాయమా అని నిలదీశారు. ఒకవేళ ఈ కేసులో రావణ్కు రిమాండ్ పడినా లేదా బెయిల్ వచ్చినా, ఆయనను వదిలిపెట్టకుండా వేధించడానికి ప్రభుత్వం అప్పుడే మరో 102 కేసులను సిద్ధం చేసిందని ఆరోపించారు. పిటి (PT) వారెంట్లతో రావణ్ను రాష్ట్రమంతా తిప్పాలని, కనీసం ఏడాది పాటు ఆయనను జైల్లోనే ఉంచాలనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య

మహిళల భద్రతను విస్మరించి సోషల్ మీడియాపైనే శ్రద్ధా?

కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కేసులపై చూపిస్తున్న శ్రద్ధను రాష్ట్రంలోని మహిళల రక్షణపై చూపించి ఉంటే బాగుండేదని శ్రవణ్ కుమార్ హితవు పలికారు. ఎంతో కాలంగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న సుగాలి ప్రీతి కేసులో మరియు రాష్ట్రంలో మహిళలపై నిరంతరం జరుగుతున్న దాడుల అణచివేతపై ఈ తరహా శ్రద్ధ పెట్టాల్సింది పోయి, కేవలం డిజిటల్ ప్లాట్ఫారమ్లపై ప్రశ్నించే వారిని టార్గెట్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam