Prashna Ravan Wife: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భర్తను కావాలని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని బచ్చలకూర అనూష (యూట్యూబర్ రావణ్ భార్య) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రోజూ ఓ కొత్త కేసులో ఇరికించి వేధింపులకు పాల్పడటం కంటే తమ కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త రావణ్ను ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక స్టేషన్కు తిప్పుతూ, తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. ఒక కేసులో బెయిల్ రాగానే, వెంటనే మరో కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారని, ఈ క్రమం నిరంతరాయంగా కొనసాగుతోందని అనూష ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తన భర్త చేసిన తప్పా అని అనూష నిలదీశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే తన భర్త కూడా మాట్లాడారని, కానీ కేవలం తన భర్తపైనే కేసులు పెట్టడం వివక్షతో చేస్తున్న కుట్ర అని ఆమె విమర్శించారు. "ఒకరు మాట్లాడితే తప్పు లేదు కానీ, ఇంకొకరు మాట్లాడితే తప్పా?" అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే, తన భర్తపై మార్ఫింగ్ వీడియోల పేరుతో తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రాజకీయ వేధింపుల వల్ల తమ కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నం అవుతోందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన కూతురు తండ్రి కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బంది పడుతోందని, పాప పరిస్థితి చూస్తే మనసు తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ఇలా రోజుకో కొత్త కేసుతో నిత్యం హింసించే కంటే, తమ కుటుంబాన్ని అంతటినీ ఒకేసారి చంపేయాలని, అప్పుడైనా ప్రభుత్వం ప్రశాంతంగా ఉంటుందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
యూట్యూబర్ రావణ్ భార్య బచ్చలకుర అనూష ప్రకటన
‘యూట్యూబర్ రావణ్గా ప్రజలకు పరిచయమున్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో. అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు, లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలకు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి, నా భర్తది కులం కమ్మ కులం. నా భర్త పేరుకూడా అధికారికంగా రావణే. రావణ్ ఫలానా పార్టీ, ఫలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ, అదే వర్గానికి చెందిన రావణ్.
సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్ది తప్ప, ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యం ప్రకారం గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత ఉన్నవారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి. లేదంటే, లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేగాని, ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు నమోదు చేయడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనలనుండి డైవర్ట్ చేయడానికి రావణ్ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు. కానీ నిజాయితీ మాకు ఉంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే, అది ఈ సమాజానికి మంచిదికాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైనా, న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది.
ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒక్కటే విజ్ఞప్తి. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని కోరుతున్నానని’ ఆయన భార్య బచ్చలకుర అనూష ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
Author : Shankar Dukanam

