Prasna Ravan Bail and Arrest: ఈ మధ్య కాలంలో జరిగిన దళిత క్రైస్తవ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఆయనకు అర్థరాత్రి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ఆయన్ని అరెస్టు చేసినప్పటి నుంచి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లే వరకు పిఠాపురంలో హైడ్రామా సాగింది. చివరకు అర్థరాత్రి బెయిల్ వచ్చింది. అయితే వెంటనే మరో కేసులో అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ఆయనకు, ఆయన తరఫున లాయర్కు తెలియజేశారు.
రావణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు పిఠాపురం జగ్గయ్య చెరువు వద్ద ఉన్న న్యాయమూర్తుల బంగ్లాకు తీసుకువెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. సుమారు రెండు గంటల పాటు బెయిల్పై వాదనలు జరిగాయి. నిందితుడు తరపున జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి వ్యక్తిగత పూచిపై బెయిల్ గ్రాంట్ చేశారు.
అంతకు ముందు పిఠాపురం పోలీస్ స్టేషన్లో హైడ్రామా నడిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోసఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ను అప్పగించాలని పెద్ద ఎత్తున జనసైనికులు స్టేషన్ను చుట్టుముట్టారు. అప్పటికే ఆయన అరెస్టు సమాచారం అందుకున్న దళిత కైస్తవ సంఘాలు అక్కడకు చేరుకున్నారు. వారు ఆయనకు రక్షణగా నిలిచారు. దీంతో పిఠాపురంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
పరిస్థితి మరింత హీటెక్కకుండానే నిరసనకారులను అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. అయినా కొందరు అక్కడే నినాదాలు చేస్తూ ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో నాటకీయపరిణామాల మధ్య రావణ్ను పోలీసులు సైలెంట్గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అర్థరాత్రి వరకు సాగిన వాదనల తర్వాత ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
అయితే ఇలా బెయిల్ వచ్చిందో లేదో మరో కేసులో రావణ్ను పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని సర్పవరం తరలించారు. దీన్ని ఆయన తరపున వాదిస్తున్న శ్రవణ్ ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిపై ఎలాంటి తప్పుడు కామెంట్స్ చేయలేదని, గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాత్రమే గుర్తు చేశారని అన్నారు. ఈ మధ్య కాలంలో నేతలు చేస్తున్న కామెంట్స్పై చర్యలు తీసుకోకుండా ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కేందుకు మాత్రమే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
జూన్ 28న జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావంలో రావణ్ శృతిమించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాధా మనోహర్దాస్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరైనా చేయిస్తున్నారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఆయనకు వచ్చే ఆదాయ వనరులను పరిశీలిస్తున్నారు.
Author : Khagesh

