Delhi Police Barricade Rahul Gandhi : ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పేపర్ లీకేజీలతో భవిష్యత్తు నాశనమై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు నివాళులర్పించేందుకు, అలాగే ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు రంగంలోకి దిగారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలందరూ కలిసి ఢిల్లీలోని తీస్ జనవరి మార్గ్ లో ఉన్న గాంధీ స్మృతికి శాంతియుత ర్యాలీగా బయలుదేరడంతో రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ నిరసన ప్రదర్శనకు ముందు రాహుల్ గాంధీ నివాసంలో విపక్ష ఎంపీలు అత్యవసర సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా , ఇతర భాగస్వామ్య పక్షాల ఎంపీలు మూడు ప్రత్యేక బస్సుల్లో గాంధీ స్మృతి వైపు పయనించేందుకు సిద్ధమయ్యారు. అయితే, సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసం బయట భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీగా బలగాలను మోహరించి వాహనాల శ్రేణిని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విద్యార్థుల పోరాటానికి మద్దతుగా రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీకేజీల వల్ల మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన అమాయక విద్యార్థులను స్మరించుకోవడానికి, న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతూ పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులకు అండగా నిలవడానికే మేమంతా గాంధీ స్మృతికి వెళ్తున్నాం అని ప్రకటించారు. భారతదేశంలో విద్యార్థులు ఒంటరి కాదని, వారి న్యాయమైన డిమాండ్ల కోసం దేశంలోని మొత్తం ప్రతిపక్షం ఐక్యంగా పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న నిరసనలను అణచివేయాలని చూస్తోందని విపక్ష నాయకులు మండిపడ్డారు. తీస్ జనవరి మార్గ్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు నగరంలో ఆంక్షలు విధిస్తూ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్ లోపల, వెలుపల నీట్ కుంభకోణంపై చర్చ జరగాలని, బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఢిల్లీ వీధుల్లో విపక్ష ఎంపీల బస్సులను పోలీసులు నిలిపివేయడం, బారికేడ్ల వద్ద నేతలు నిరసనలకు దిగడంతో ఈ వివాదం మోదీ ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది. విద్యార్థి ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్న వేళ, కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.
Author : Raja Sekhar Allu

