Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rahul Gandhi PM Hopes: రాహుల్ ప్రధాని ఆశలకు  తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?

Rahul Gandhi PM Hopes: రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?

ABP దేశం 5 days ago

Congress Downfall: భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో మళ్లీ బలమైన పునరుజ్జీవం సాధించాలంటే, ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్న ప్రధాన రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలను కాపాడుకోవడం అత్యంత కీలకం.

దేశవ్యాప్తంగా ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉన్నందున , రాహుల్ గాంధీ నాయకత్వానికి , కాంగ్రెస్ భవిష్యత్తుకు ఈ రెండు దక్షిణాది రాష్ట్రాలే ప్రధానంగా బలంగా నిలిచాయి. అయితే, అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ గ్రాఫ్ క్షీణిస్తుండటం, క్షేత్రస్థాయిలో అసంతృప్తి పెరుగుతుండటం రాబోయే సార్వత్రిక సమరానికి తీవ్రమైన హెచ్చరికగా మారుతోంది.

పెరుగుతున్న అధికార వ్యతిరేకత

కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ-జేడీఎస్ కూటమి ఏకంగా 19 సీట్లను కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితమవుతుందని ఇటీవలి సర్వేలు అంచనా వేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి, భారీ గ్యారెంటీ పథకాలతో అధికారంలోకి వచ్చినప్పటికీ, ఎస్సి, ఎస్టి నిధుల మళ్లింపు ఆరోపణలు, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్, సిద్ధరామయ్య-డీకే శివకుమార్ మధ్య నాయకత్వ పోరు వల్ల అధికార కాంగ్రెస్ వేగంగా ప్రజాదరణ కోల్పోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత వివాదాలు

ఇటు తెలంగాణలోనూ పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరినప్పటికీ.. ఆర్నెల్లు దాటేసరికే పంట రుణాలు, రైతు భరోసా, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు కాలేదన్న నిరసన రైతాంగంలో, సామాజిక వర్గాల్లో కనిపిస్తోంది. దీనికి తోడు ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిలు వరుస పోరాటాలతో కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ఆ సర్వేల ప్రాకారం తెలంగాణలో సైతం బిజెపి పుంజుకుంటూ కాంగ్రెస్ స్థానాలను లాక్కునే దిశగా అడుగులు వేస్తుండటం, లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఆశించిన మెజారిటీకి అడ్డుకట్ట వేస్తోంది.

అధికార వ్యతిరేకత ప్రారంభమైతే ఆపడం కష్టం

సాధారణంగా ఏదైనా అధికారంలో ఉన్న పార్టీకి పతనం ప్రారంభమైతే, ఆ యాంటీ-ఇన్కంబెన్సీని త్వరితగతిన అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మితిమీరిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఖజానాలో నిధులు లేకపోవడం, మౌలిక వసతుల కల్పన నిలిచిపోవడం ఈ రెండు రాష్ట్రాల ఆర్థిక పరిమితులను బయటపెడుతోంది. ఫలితంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరాశ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు కనుక ప్రతికూలంగా వస్తే, లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీని ఢీకొట్టాలనే రాహుల్ గాంధీ ప్రధాని పీఠం ఆశలు మరింత సుదూరం కాక తప్పవు.

దక్షిణాదిపైనే రాహుల్ ఆశలు

దక్షిణాదిలో కాంగ్రెస్ బలంగా లేకపోతే, ఇండియా కూటమిలోని ఇతర ప్రాంతీయ పార్టీల ముందు కాంగ్రెస్ పెద్దన్న పాత్రను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. జాతీయ స్థాయిలో మోదీ వర్సెస్ రాహుల్ పోరులో రాహుల్ గాంధీ మరో ఐదేళ్ల కాలం ప్రతిపక్షానికే పరిమితమై ఎదురుచూడాల్సి వస్తుంది. ఉచిత పథకాల ప్రకటనల ఆధారంగా అధికారంలోకి రావడం సులభమే అయినా, సుపరిపాలన అందించడంలో విఫలమైతే ప్రజలు త్వరగానే తిరస్కరిస్తారనడానికి కర్ణాటక, తెలంగాణ రాజకీయాలే ఉదాహరణగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే మేల్కొని, అంతర్గత కలహాలను చక్కదిద్ది, పాలనపై దృష్టి సారించకపోతే.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలంగా మారడం ఖాయం.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam