తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం: ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వర్షాల హెచ్చరికహైదరాబాద్/ అమరావతి: ఎల్నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్రమైన ఎండలకు అల్లాడిపోతున్నారు. అదే సమయంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అరేబియా మహాసముద్రం, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడుతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించనున్నాయి. మరోవైపు ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న తూర్పు విదర్భపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా దక్షిణ కేరళ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది.
ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం, బుధవారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే నమోదుకానున్నాయి. ఆ తర్వాత పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గనున్నాయి. అయితే ఈ రెండు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఏపీలో కొన్నిచోట్ల తీవ్రమైన ఎండలు.. కొన్ని జిల్లాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు విదర్భ నుండి దక్షిణ కేరళ వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉండటం ఈ మార్పులకు ప్రధాన కారణమని వాతావరణశాఖ పేర్కొంది.
బుధవారం పిడుగులతో వర్షాలు
మరోవైపు, రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా గరిష్టంగానే ఉంది. మంగళవారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో బుధవారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశంతో పాటు, ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.
సోమవారం నాడు గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్రీలు, మార్కాపురం పరిధిలోని నందనమారెళ్లలో 43.3 డిగ్రీలు, వెంకటగిరిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే సింధురాజపురంలో 42.2 డిగ్రీలు, మాచర్లలో 41.5 డిగ్రీలు, సంజామల, కనగానపల్లి ప్రాంతాలలో 41 డిగ్రీల చొప్పున భానుడి భగభగలు రికార్డయ్యాయి.
Author : Shankar Dukanam

