Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?

Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?

భారతీయుల నరనరాల్లో జీర్ణించుకున్న పురాణ ఇతిహాస గ్రంథం 'రామాయణం' (Ramayanam). సీతారాముల కథను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాల్మీకి రాసిన రామాయణమే మన భారతీయులకు ప్రామాణికం.

ఆయన తర్వాత పలువురు రామాయణాన్ని తమ తమ శైలిలో రాశారు. అయితే... వాల్మీకి రామాయణానికి ఉన్న విలువ ఇతరులు రాసిన కావ్యానికి లేదు. అందువల్ల, రణబీర్ కపూర్ - సాయి పల్లవి - యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వం వహించిన 'రామాయణ పార్ట్ 1' (Ramayana Part 1)ను థియేటర్లలో చూసిన కొందరు... సినిమాలో మార్పులపై కించిత్ ఆశ్చర్యంతో పాటు విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మూడు తప్పులను వేలెత్తి చూపిస్తున్నారు. అవి ఏమిటంటే?

ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన 'రామాయణ' క్లైమాక్స్!
సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళుతున్న సమయంలో జటాయువు వీరోచితంగా పోరాడుతుంది. రావణుడి బారి నుంచి సీతమ్మను కాపాడాలని తన శక్తి వంచన లేకుండా పోరాడుతుంది. రావణుడి ఖడ్గానికి జటాయువు రెక్క తెగి పడుతుంది. ఎగరలేక గాల్లో విలవిలలాడి కింద పడి ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత రాముడి కంట పడుతుంది. 'రామాయణ' పార్ట్ 1'లో ఇక్కడి వరకు బావుంది. కానీ, ఆ తర్వాత సినిమాలో చూపించినది ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.

సినిమాలో ఏం చూపించారు?: రెక్క తెగడంతో కింద పడిన జటాయువును సీతమ్మ గురించి రాముడు అడగ్గా... రావణాసురుడు అపహరించుకుని వెళ్ళాడని, అతనికి లంకా నగరం అని, బ్రహ్మ నుంచి వరాలు పొందాడని చెబుతుంది.

వాల్మీకి 'రామాయణం'లో ఏముంది?: సీతమ్మ గురించి రాముడు అడగ్గా... రావణ బ్రహ్మ అపహరించుకుని వెళ్ళాడని మాత్రమే జటాయువు చెబుతుంది. ఆ తర్వాత సీతమ్మ జడ వెతుకుతూ వెళ్లిన హనుమంతునికి రావణుడు లంకలో ఉంటాడని సంపాతి చెబుతుంది. అదేమీ లేకుండా నేరుగా రాముడికి రావణుడిది లంక అని జటాయువు చెప్పినట్టు చూపించారు. దాన్ని పార్ట్ 1 క్లైమాక్స్ చేశారు. రెండో పోర్టులో లంకా దహనం, రామ రావణ యుద్ధం ఉంటాయని చెప్పకనే చెప్పారు.

శూర్పణఖ భర్తను రావణుడు ఎక్కడ చంపాడు?
రాముడిని చూసి ముగ్ధురాలైన శూర్పణఖ తనను వివాహం చేసుకోమని కోరుతుంది. తాను ఏకపత్నీవ్రతుడు అని, సీతకు తప్ప తన మనసులో మరొక మహిళకు చోటు లేదని రాముడు స్పష్టం చేస్తాడు. అయితే... అంతకు ముందు శూర్పణఖకు పెళ్ళి అవుతుంది. ఆమె భర్తను సోదరుడు రావణుడు చంపుతాడు. అందులో ఎవరికీ ఏ సందేహాలు లేవు. అయితే... శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడిని రావణుడు ఎక్కడ చంపాడు? అనేది ఇప్పుడు తలెత్తున్న ప్రశ్న.

సినిమాలో ఏం చూపించారు?: కుంభకర్ణుడు ఆరు నెలలకు ఓసారి నిద్ర నుంచి మెలకువలోకి వస్తాడనేది తెలిసిన విషయమే. ఆ సందర్భాన్ని వేడుకలా లంకలో సంబరాలు చేస్తుంటే... మద్యం అందిస్తున్న చెలికత్తెతో విద్యుజ్జిహ్వుడు అమర్యాదగా ప్రవర్తించాడని, అందుకు రావణుడు ఆగ్రహం చెంది చంపినట్టు సినిమాలో చూపించారు.

వాల్మీకి 'రామాయణం'లో ఏముంది?: విద్యుజ్జిహ్వుడు కూడా అసుర గణానికి చెందినవాడు. యుద్ధాల్లో రావణుడి వెంట ఉన్నవాడు. లంకాధిపతి కావాలని విద్యుజ్జిహ్వుడు మనసులో ఉంటుంది. అది తెలిసి ఓ యుద్ధంలో అతడిని రావణుడు వధిస్తాడు. దాన్ని మార్చి చూపించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

సీతాదేవి యుద్ధం చేసిందా? పరుగులు తీసిందా?
వనవాసంలో శూర్పణఖకు లక్ష్మణుడి చేతిలో అవమానం (ముక్కు కోయడం) జరుగుతుంది. దాంతో సీతారాములు ఉన్న పంచవటి అడవికి అసురులు వస్తారు. వాళ్ళతో రాముడు యుద్ధం చేసి సుమారు 14 వేల మందిని చంపుతాడు. అక్కడ వరకు సబబే. కానీ...

సినిమాలో ఏం చూపించారు?: వనవాసంలో తమపై అసురులు దండెత్తినప్పుడు రామలక్ష్మణులతో పాటు సీతాదేవి సైతం కత్తులు పట్టుకుని యుద్ధం చేసినట్టు చూపించారు.

వాల్మీకి 'రామాయణం'లో ఏముంది?: సుమారు వారం పాటు 14 వేల మంది అసుర సైన్యంపై రాముడు యుద్ధం చేసినట్టు ఉంది. సీతాదేవి పరాక్రమం గురించి పెద్దగా పేర్కొనలేదు. దాంతో ఆ సన్నివేశంపై విమర్శలు వస్తున్నాయి. అడవిలోని తమ నివాసానికి శూర్పణఖ వచ్చి వెళ్ళిన తర్వాత రాముడితో 'ఆమె మిమ్మల్ని మోహిస్తోంది' అని సీత చెప్పడం పట్ల కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ మూడు సన్నివేశాలపై ప్రేక్షకులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తప్పుగా చూపించారని పేర్కొంటున్నారు. ఇంకొన్ని సన్నివేశాలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చిత్ర బృందం వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Author : Satya Pulagam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam