Ravana Brahma: రామాయణంలో రావణుడిని సాధారణంగా ప్రతినాయకుడిగా చూస్తాం కానీ ఆధ్యాత్మిక, పౌరాణిక సంప్రదాయాల్లో రావణుడి వ్యక్తిత్వం ఎంతో విస్తృతమమైనది.
ఇంతకీ రావణుడిని రావణ బ్రహ్మ అంటారెందుకు? సృష్టికర్త బ్రహ్మకు, లంకాధిపతి రావణుడికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమమాధానం తెలుసుకుంటే రావణుడి వ్యక్తిత్వంలో మరో కోణం ఆవిష్కృతమవుతుంది.
సృష్టికర్త బ్రహ్మతో రావణుడికి ఉన్న సంబంధం ఏంటి?
రావణుడు అంటే కేవలం ఓ ప్రతినాయకుడు మాత్రమే కాదు. అపారమైన జ్ఞానం, అసాధారణమైన శివభక్తి, మహోన్నతమమైన తపశ్శక్తితో పాటూ అహంకారంతో కూడిన అపారమైన అధికార కాంక్ష కలిగిన సంక్లిష్టమైన వ్యక్తిత్వం. అందుకే ఆయనను రావణ బ్రహ్మ అంటారు.
బ్రహ్మవంశంలో జన్మించిన రావణుడు
హిందూ పురాణాల ప్రకారం రావణుడు బ్రహ్మ వంశానికి చెందినవాడు. సృష్టికర్త బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరైన మహర్షి పులస్త్యుడు రావణుడి వంశానికి చెందిన మూలపురుషుడు.
పులస్త్యుడి కుమామరుడు విశ్రవసుడు
విశ్రవసుడి - కైకసికి జన్మించినవాడు రావణుడు
అంటే..
రావణుడు బ్రహ్మదేవుడికి మునిమనవడు
రావణుడికి బ్రహ్మతో ఉన్న సంబంధం కేవలం పేరులోది మాత్రమే కాదు..వంశపారపర్యమైనది కూడా. అయితే రావణుడే సృష్టికర్త బ్రహ్మ అని అర్థం కాదు. బ్రహ్మవంశంలో జన్మించినవాడు కావడం, బ్రాహ్మణ వంశానికి చెందినవాడు కావడం ఆయనకు ప్రత్యేకమైన పౌరాణిక నేపథ్యాన్నిచ్చాయ్.
రావణబ్రహ్మ అనే పేరులో అంతరార్థం
రావణుడు సాధారణమైన రాజు కాదు. వేదాలు, శాస్త్రాలు, సంగీతం, జ్యోతిష్యం, ఆయుర్వేదం వంటి అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించి మహాపండితుడిగా పురాణాలు అభివర్ణించాయి. రావణుడు గొప్ప శివభక్తుడు కూడా. పరమేశ్వరుడిని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు, తన భక్తి, తపోబలంతో విశేషమైన వరాలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
శివతాండవ స్తోత్రం రావణుడి పేరుతో ప్రసిద్ధి చెందడం ఆయన భక్తి, కవితా ప్రతిభకు నిదర్శనంగా భావిస్తారు. ఈ స్థాయి పాండిత్యం, తపస్సు, ఆధ్యాత్మిక సాధన కలిగిన వ్యక్తి కావడంతో ఆయనను గౌరవార్థంగా రావణబ్రహ్మ అని సంబోధించే సంప్రదాయం ఏర్పడింది. ఇక్కడ బ్రహ్మ అనే పదాన్ని సృష్టికర్త బ్రహ్మతో సమానమైన వ్యక్తి అనే అర్థంలో కాకుండా, బ్రహ్మజ్ఞానం, పాండిత్యం, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకగా కూడా అర్థం చేసుకోవాలి.
జ్ఞానం ఉన్నా ధర్మ లేకపోతే?
రావణుడి జీవితంలో అసలైన ఆధ్యాత్మిక సందేశం ఇక్కడే ఉంది. అపారమమైన జ్ఞానం ఉన్నా, తపస్సుతో శక్తులను సంపాదించినా, ఇంద్రియ నిగ్రహం లేకపోతే పతనం తప్పదని రావణుడి పాత్ర మనకు బోధిస్తుంది. రావణుడికి వేదజ్ఞానం ఉంది. శివభక్తి ఉంది, అపారమైన పరాక్రమం ఉంది. కానీ కామం, క్రోధం, అహంకారం ఆయన వివేకాన్ని కప్పేశాయి. పరస్త్రీని అపహరించి ధర్మమార్గాన్ని అతిక్రమించాడు. తనకు తెలిసిన ధర్మాన్ని ఆచరణలో పెట్టలేపోయాడు. అందుకే రామాయణం మనకు చెప్పే సందేశం ఏంటంటే.. జ్ఞానం సంపాదించడం గొప్పే కానీ ఆ జ్ఞానాన్ని ధర్మబద్ధంగా ఉపయోగించడం అంతకన్నా గొప్పది. భక్తి ఉండడం గొప్పే కానీ భక్తితో పాటూ వినయం,మంచి ప్రవర్తన కూడా ఉండాలి.
రావణుడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇదే
రావణుడిని పూర్తిగా దుష్టుడిగా మాత్రమే చూడడం సరికాదు..అలాగే ఆయన పాండిత్యాన్ని చూసి అధర్మాన్ని సమర్ధించడం కూడా అంతే పొరపాటు. రాముడు ధర్మానికి ప్రతీక అయితే రావణుడు జ్ఞానం, అహంకారం మధ్య జరిగిన సంఘర్షణకు ప్రతీక.
రావణ బ్రహ్మ అనే సంబోధన ఓ విషయాన్ని గుర్తుచేస్తుంది. మనిషి ఎంతటి విద్యావంతుడైనా, శక్తిమంతుడైనా, ధర్మాన్ని విడిచిపెడితే పతనం తప్పదు
బ్రహ్మవంశంలో పుట్టడం గొప్పకావొచ్చు
బ్రహ్మజ్ఞానం సంపాదించడం విశిష్టత కావొచ్చు
కానీ..
ఆ జ్ఞానాన్ని ధర్మంగా మలుచుకున్నప్పుడే మహనీయుడు అవుతాడు
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Author : RAMA

