Rashmi Gautam With Her Pet Dog: మూగ జీవాలు అంటే పాపులర్ యాంకర్, నటి రష్మీ గౌతమ్‌కు ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కాలంలో రోడ్లపై ఆహారం కోసం అలమటిస్తున్న మూగ జీవాలకు అన్నం పెట్టారు.
మూగ జీవాల కోసం ఆమె పోరాటం చేసిన రోజులు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఏపీలోని బాపట్ల జిల్లాలో గల చీరాలలో పెంపుడు కుక్కపై ఓ మహిళ విచక్షణా రహితంగా దాడి చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఆ కుక్కకు ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకు వచ్చారు రష్మీ గౌతమ్. ఆ వివరాల్లోకి వెళితే...
కుడి కాలు తీసేశారు... సర్జరీకి 30 వేలు!
బిల్డింగ్ మీద కుక్కను ఓ మహిళ కొడుతున్న సమయంలో మరో బిల్డింగ్ నుంచి చీరాల నివాసి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్ కావడంతో బంబుల్ బడ్డీస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆ కుక్కను అక్కున చేర్చుకుంది. కుక్క పరిస్థితి అసలు బాలేదని, సర్జరీ అవసరం అవుతుందని, అందుకు 30 వేలు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ రష్మీ గౌతమ్ కంట పడింది. ఆమె చొరవతో కుక్కకు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. ముందు వైపు కుడి కాలు తీసేశారు. ఇదంతా ఫిబ్రవరిలో జరిగింది.
మహిళ దాడిలో కుక్క కాలికి తీవ్రంగా గాయం కావడమే కాదు... ఇన్ఫెక్షన్ బారిన కూడా పడింది. దాన్నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది.
కుక్కకు లక్ష్మి అని పేరు పెట్టిన రష్మీ!
సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని పెంపుడు కుక్క ఇంటికి చేరిందని నిన్న (మంగళవారం, ఆగస్టు 4న) రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ కుక్కకు లక్ష్మి అని పేరు పెట్టానని, అయితే చుట్కీ అని పిలుస్తున్నానని ఆమె పేర్కొన్నారు. లక్ష్మి పేరు కంటిన్యూ చేయాలా? లేదంటే చుట్కీ 2.0 అని పిలవాలా? అని నెటిజనులను సలహా అడిగారు. అదీ సంగతి. కుక్క ఆరోగ్యంగా ఇంటికి చేరిన ఆనందం రష్మీ గౌతమ్ కళ్ళలో కనిపించింది.
Author : S Niharika

