హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్ల సవరణ ప్రక్రియ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటర్ల జాబితాలో క్లెయిమ్లు, అభ్యంతరాల సమర్పణకు ప్రస్తుతం ఉన్న సెప్టెంబర్ 16 గడువును మరో 4 వారాల పాటు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దీంతో పాటు తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును కూడా పొడిగించాలని, తద్వారా అర్హులైన ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ఈసీకి తెలిపారు.
ప్రస్తుతం దాదాపు 73.39 లక్షల ఎంట్రీలు ASDD (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డ్యూప్లికేట్) కేటగిరీలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని కూడా శాశ్వతంగా తరలివెళ్లినట్టుగా పరిగణించి ఓటర్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కనుక, ఈసీ జారీ చేసిన నోటీసులకు స్పందించడానికి ఓటర్లకు తగినంత సమయం ఇవ్వాలని, కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకోవడానికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
ఈ ప్రక్రియలో అర్హులైన పౌరుల పేర్లు తొలగించకుండా చూడటానికి నియోజకవర్గాల్లోని ERO (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) స్థాయిలో సిబ్బంది సంఖ్యను మరింత పెంచాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం వైపు నుండి ఎన్నికల సంఘానికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఈసీకి రేవంత్ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలివే..
తెలంగాణలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(SIR)పై సీఎం రేవంత్ రెడ్డి CEC జ్ఞానేష్ కుమార్కు 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. జూన్ 10 నాటి 3.38 కోట్ల మంది ఓటర్ల జాబితాలో దాదాపు 73.39 లక్షల మందిని (21.7 శాతం) ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డ్యూప్లికేట్ (ASDD) కేటగిరీ కింద చేర్చడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారమ్లలో 60.50 లక్షల ఫారమ్లలో లోపాలు ఉన్నాయని, 32.36 లక్షల ఫారమ్లకు పాత ఓటర్ల జాబితాతో లింక్ లేదన్నారు. ఇవన్నీ కలిపి మొత్తం 92.86 లక్షల మంది ఓటర్లు (రాష్ట్రంలోని మూడో వంతు ఓటర్లు) తమ అర్హతను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, లేకపోతే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ASDD జాబితాలో ఉన్న 73.39 లక్షల ఎంట్రీలలో 45.19 లక్షల మంది (దాదాపు 62 శాతం) శాశ్వతంగా తరలివెళ్లిన వారిగా వర్గీకరించడం సరికాదని, తాత్కాలికంగా పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని కూడా శాశ్వతంగా మారినట్లు భావించడం వల్ల అర్హులైన పౌరులకు అన్యాయం జరుగుతుందన్నారు.
కనుక ఓటర్ల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ఏ ఒక్క అర్హులైన ఓటరు నష్టపోకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి పలు కీలక విజ్ఞప్తులు చేశారు.
క్లెయిమ్లు, అభ్యంతరాల గడువు పొడిగింపు: ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న ఒక నెల గడువు చాలా తక్కువ అని, ఈ గడువును మరో 4 వారాల పాటు పొడిగించాలి. అక్టోబర్ 19న జరిగే తుది జాబితా ప్రచురణను కూడా తగిన విధంగా ముందుకు జరపాలని కోరారు.
గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు: గ్రామాలు, మున్సిపల్ వార్డులలో కనీసం 2 సార్లు ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను చదివి వినిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఓటర్లకు కనీసం 3 నుంచి 4 వారాల సమయం ఇవ్వాలని లేఖలో కోరారు.
హెల్ప్డెస్క్ల ఏర్పాటు: ఓటర్లకు అవసరమైన పత్రాలను పొందడంలో సహకరించడానికి పోలింగ్ బూత్ స్థాయిలో హెల్ప్డెస్క్లను అందుబాటులోకి తేవాలని సూచించారు.
అంగీకరించే పత్రాల జాబితా: జీవో Ms. No. 172 కింద జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ను మినహాయించడం వల్ల పట్టణ ప్రాంత ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా సులభంగా పొందే పత్రాలను కూడా అనుమతించేలా జాబితాను సవరించాలని కోరారు.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ASDD కేటగిరీలు ఎక్కువగా ఉన్నందున, ERO స్థాయిలో అదనపు అధికారులను నియమించి ప్రక్రియను వికేంద్రీకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ మొత్తం ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక, అధికారిక సహాయ సహకారాలను అందిస్తుందని సీఎం తన లేఖలో స్పష్టం చేశారు.
Author : Shankar Dukanam

