Rajasthan Royals Captain Riyan Parag Fined for Vaping: ఐపీఎల్ 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక అనూహ్య వివాదంలో చిక్కుకున్నాడు.
పంజాబ్ కింగ్స్తో ముల్లన్పూర్లో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో పరాగ్ 'వేపింగ్' (Vaping) చేస్తూ కెమెరా కంటికి దొరికిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం పరాగ్పై కఠిన చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ సీరియస్ - లెవల్ 1 నిబంధనల ఉల్లంఘన..
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం, ఆట ప్రతిష్టను దిగజార్చే పనులు చేయడం నేరం. రియాన్ పరాగ్ చేసిన పని లెవల్ 1 నేరం కిందకు వస్తుందని మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ నిర్ధారించారు. జరిమానాతో పాటు పరాగ్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ కూడా చేరింది. తన తప్పును పరాగ్ అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే శిక్షను ఖరారు చేశారు. రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లోపల వేప్ ఉపయోగిస్తున్న దృశ్యాలు టీవీ స్క్రీన్లపై స్పష్టంగా కనిపించాయి. ఇది ఐపీఎల్ గౌరవానికి భంగం కలిగించే చర్య అని బీసీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

