Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Romanchakam Review - 'రోమాంచకం' రివ్యూ: సుమంత్ ప్రభాస్ సినిమా హిట్టేనా? బడ్డీ కామెడీ ఎలా ఉందంటే?

Romanchakam Review - 'రోమాంచకం' రివ్యూ: సుమంత్ ప్రభాస్ సినిమా హిట్టేనా? బడ్డీ కామెడీ ఎలా ఉందంటే?

ABP దేశం 2 days ago

Sumanth Prabhas Romanchakam Movie Review: సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రొమాంటిక్ బడ్డీ కామెడీ 'రోమాంచకం'. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ... అనేది ఉపశీర్షిక.

అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. అభిమానుల్లో ఒకరు హీరోగా వచ్చారని, ఓపెనింగ్స్ అదిరిపోవాలని ప్రభాస్ చెప్పడంతో సినిమాకు మరింత బజ్ వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.

కథ (Romanchakam Movie Story): అన్వేష్ (సుమంత్ ప్రభాస్)ది హైదరాబాద్. 'రోమాంచకం' పేరుతో ఓ డేటింగ్ యాప్ తీసుకు రావాలని ప్రయత్నిస్తాడు. దాని కోసం రీసెర్చ్లో భాగంగా మరొక డేటింగ్ యాప్లో చెన్నై అమ్మాయి మైథిలీ (అనంతిక సనిల్ కుమార్)తో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా గంటలు కొలదీ ఫోనులు మాట్లాడే వరకు వెళుతుంది. మైథిలీ పుట్టినరోజున సర్ప్రైజ్ చేయడానికి చెన్నై వెళతాడు అన్వేష్. ఆ విషయం తెలిశాక బ్లాక్ చేస్తుంది మైథిలీ.

అన్వేష్ను మైథిలీ ఎందుకు బ్లాక్ చేసింది? తర్వాత హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అన్వేష్ను పోలీస్ నంజుండప్పా (ఉపేంద్ర లిమయే) ఎందుకు అరెస్ట్ చేశాడు? అన్వేష్ - మైథిలీ మధ్య ఉన్నది ప్రేమా? లేదంటే ఆకర్షణా? చివరకు ఏం తెలుసుకున్నారు? వాళ్ళిద్దరి ప్రయాణంలో స్నేహితుల పాత్ర ఏమిటి? అనేది సినిమా.

విశ్లేషణ (Romanchakam Review In Telugu): సందీప్ రెడ్డి వంగా సమర్పకుడు కావడం, విడుదలకు ఒక్క రోజు ముందు ప్రభాస్ బైట్ ఇవ్వడంతో 'రోమాంచకం' సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు, పాటలు కూడా ప్రామిసింగ్గా అనిపించాయి. అసలు సినిమా ఎలా ఉంది? ఇందులో ఏముంది? అనే అంశాల్లోకి వెళితే...

ప్రేమ, హాస్యం, ఉత్కంఠ... ఇదీ 'రోమాంచికం' క్యాప్షన్. అచ్చ తెలుగు టైటిల్ పెట్టిన దర్శక నిర్మాతలను మెచ్చుకోవాలి. ఒకవేళ టైటిల్ మీనింగ్ తెలియని ఆడియన్స్ ఎవరైనా ఉంటే... 'గూస్ బంప్స్' అని చెప్పవచ్చు. రోమాలు నిక్కపొడుచుకునేలా, గూస్ బంప్స్ వచ్చేంత కథ లేదా మనసు మైమరచిపోయేంత ప్రేమ లేదా కళ్ళు అప్పగించి చూసేంత ఉత్కంఠ ఉన్నాయా? అంటే... లేవు అని చెప్పాలి. మనకు నచ్చేది, మనసుకు హాయిని ఇచ్చేది ఏమైనా ఉదంటే... అది హాస్యమే.

Gen Z ప్రేమను, ముఖ్యంగా హైదరాబాదీ యువతను తెరపైకి తీసుకు రావడానికి దర్శక రచయితలు - నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అది మంచిదే. అయితే... ఈ తరం యువతకు ప్రేమ అంటే తెలియదనే రీతిలో సన్నివేశాలు రాస్తే కష్టమే. ఏ కథకు, సినిమాకు అయినా సరే కోర్ పాయింట్ ఒకటి ఉండాలి. ఈ సినిమాలో అది కొరవడింది. సిల్లీ కథతో సిట్యువేషనల్ కామెడీతో టైమ్ పాస్ చేశారు. ప్రేమలో సీరియస్నెస్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. సినిమా మొదలైన చాలాసేపటి వరకు ఎటు వెళుతుందో అర్థం కాదు. అక్కడ కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. హీరో చెన్నైకు వెళ్లిన తర్వాత నుంచి కథ కాస్త ట్రాక్లోకి వచ్చింది. కామెడీ పేలింది.

'రోమాంచికం'తో దర్శకుడిగా పరిచయమైన వేణుగోపాల్ రెడ్డి రచనలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. జెన్ జి పల్స్, యూత్ మైండ్ సెట్ బాగా క్యాచ్ చేశారు. అయితే... హీరో హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్లు బలంగా రాసుకోలేదు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఎందుకు కలిగింది? ఒకరిపై మరొకరి మనసులో ఎంత బలమైన ఫీలింగ్స్ ఉన్నాయి? అనేది సరిగా ఆవిష్కరించలేదు. దాంతో కథ, కథనాల్లో బలం తగ్గింది. కానీ, కామెడీ ఫుల్ మీల్స్ పెట్టింది.

టెక్నికల్ టీమ్ నుంచి 'రోమాంచకం' దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. వాసుకి వైభవ్ అందించిన పాటలు అన్నీ బావున్నాయి. లైటింగ్ ప్యాటర్న్ కూడా. అలాగే నేపథ్య సంగీతం కూడా. పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ కూడా నీట్గా ఉంది. ఫ్రేమ్స్ బావున్నాయి. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

'రోమాంచికం' కథకు తగ్గట్టు హీరో హీరోయిన్లు సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ నటించారు. తమ వయసుకు తగ్గ పాత్రలు కావడంతో ఈజీగా చేశారు. ఆ ఇద్దరినీ డామినేట్ చేశారు నరేంద్ర రవి. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'లో ఆకట్టుకున్న ఈ యంగ్ యాక్టర్... మరోసారి తనదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టారు. నరేంద్ర రవి డైలాగులు, ఆయన కామెడీ టైమింగ్ నవ్వించాయి. సినిమా చివరిలో అనుదీప్ కేవీ అతిథి పాత్రలో విజిల్స్ వేయించారు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగులో అందరూ బాగా చేశారు. పోలీసుగా ఉపేంద్ర లిమయే కాస్త ఉత్కంఠ కలిగించారు. ఆయన కాంబినేషన్ సన్నివేశాల్లోనూ నరేంద్ర రవి హైలైట్ అయ్యారు.

'రోమాంచికం'లో కామెడీ ఉంది. కథ కంటే ఆ కామెడీ ఎక్కువ హైలైట్ అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంది. కానీ ఒక్కసారి కామెడీ ట్రాక్ మీదకు వచ్చిన తర్వాత రిలీఫ్ ఇచ్చింది. హీరో హీరోయిన్ల ప్రేమలో క్లారిటీ లేకున్నా కాస్త నవ్వులు, మంచి పాటలు ఉంటే చాలు అని ఆశించే ప్రేక్షకులు హ్యాపీగా థియేటర్లకు వెళ్ళవచ్చు. బడ్డీ కామెడీ ఒక్కటే బావుందీ బాసూ!

Author : Satya Pulagam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam