ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫైయర్లో శుక్రవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) తలపడనున్నాయి. మొదటి క్వాలిఫైయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఓటమిని చవిచూసింది.
ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను రాజస్తాన్ జట్టు ఓడించింది. రెండో క్వాలిఫైయర్లో ఒంటిచేత్తో మ్యాచ్ రూపురేఖలను మార్చేయగల టాప్ 5 ఆటగాళ్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
వైభవ్ సూర్యవంశీ: ఎలిమినేటర్ మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించి మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ రాయల్స్కు రెండో క్వాలిఫైయర్ టికెట్ అందించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్లోనూ 15 ఏళ్ల టీనేజర్ ఆర్ఆర్కు కీలకం కానున్నాడు. అతడు కనుక మరోసారి చెలరేగితే ప్రత్యర్థి గుజరాత్ జట్టుకు ఓటమి తప్పదు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ బంతికి సెంచరీ చేసింటే ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డు నమోదయ్యేది.
జోఫ్రా ఆర్చర్: రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గత కొన్ని మ్యాచ్లుగా బంతితో అద్భుతం చేస్తున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా సన్రైజర్స్ మీద ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్ల్లో జోఫ్రా ఆర్చర్ 24 వికెట్లు పడగొట్టాడు. పవర్ప్లే, చివరి డెత్ ఓవర్లలో పేసర్ ఆర్చర్ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
శుభ్మన్ గిల్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు కూడా ఈ సీజన్ బాగా కలిసొచ్చింది. కెప్టెన్గానూ మరోవైపు బ్యాటర్గానూ నిలకడగా రానిస్తున్నాడు. 14 మ్యాచ్ల్లో గిల్ 159 స్ట్రైక్ రేట్తో 618 పరుగులు చేశాడు. గిల్, సాయి సుదర్శన్తో కలిసి ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్కు పలు కీలక మ్యాచ్ల్లో విజయాన్ని అందించాడు. రెండో క్వాలిఫైయర్ మ్యాచులో గనుక సుదర్శన్, గిల్ జోడి మరోసారి రాణిస్తే, రాజస్థాన్ రాయల్స్కు చిక్కులు తప్పవు. వీరి వికెట్లపైనే రాజస్తాన్ బౌలర్లు ఫోకస్ చేస్తారు.
సాయి సుదర్శన్: రెండో క్వాలిఫైయర్లో గుజరాత్ టైటాన్స్ ముందుకు వెళ్తుందా లేదా అంటే చాలా వరకు సాయి సుదర్శన్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్లో సాయి సుదర్శన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 15 మ్యాచ్ల్లో 157 స్ట్రైక్ రేట్తో ఆడుతూ 652 పరుగులు చేశాడు. సుదర్శన్ మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో పాటు ఈ సీజన్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సాయి సుదర్శన్ గనుక మెరుపు ఇన్నింగ్స్ ఆడితే, గిల్తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పితే రాజస్థాన్ రాయల్స్ కష్టాలు పెరగవచ్చు.
ధ్రువ్ జురెల్: వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు గోడ కడుతున్నాడు. ఆ తరువాత టాపార్డర్లో ధ్రువ్ జురెల్ ఈ సీజన్లో కీలక ఇన్నింగ్సులు ఆడాడు. జట్టు విజయానికి అవి హెల్ప్ చేశాయి. సన్రైజర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా వికెట్ కీపర్ బ్యాటర్ జురెల్ కేవలం 21 బంతుల్లోనే 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్రత్యర్థి జట్టును మరింత దెబ్బతీశాడు. ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్ల్లో జురేల్ 508 పరుగులు చేశాడు. కీలకమైన 3వ స్థానంలో జురెల్ లాంటి బ్యాటర్ పరుగులు సాధిస్తే ప్రత్యర్థి జట్టుకు విజయం అంత ఈజీ కాదు.
Author : Shankar Dukanam

