Dailyhunt
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం

RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం

ABP దేశం 6 days ago

వేంపల్లి: కడప జిల్లా వేంపల్లి మండలంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. వీరన్నగట్టుపల్లి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు 11KV విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కదిరి డిపోకు చెందిన ఈ పల్లె వెలుగు బస్సు వేంపల్లి నుండి కదిరి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు పైభాగం (టాప్) హైవోల్టేజ్ విద్యుత్ వైర్లకు తాకడంతో క్షణాల్లో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.

ప్రయాణికులు కేకలు వేయడంతో ఆగిన బస్సు..

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. అయితే బస్సు టాప్ మీద మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో, అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు. ప్రయాణికులందరూ త్వరగా బస్సు నుండి కిందకు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మంటలు ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది..

అయితే, మంటలు తీవ్రరూపం దాల్చడంతో ఆర్టీసీ బస్సు కొంత సమయానికే పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కొంతసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అప్రమత్తమై బస్సు నిలిపివేసి, అందరూ కిందకు దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఆ హైవోల్టేజ్ హైటెన్షన్ వైర్లను ఎత్తులోకి ఉండేలా చూడాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam