Srikakulam Crime News | ఎచ్చెర్ల: చదువు చెప్పే చోట సైతం బాలికలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన వారే కీచకులుగా మారి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
ఇటీవల విజయవాడలోని ఆయుర్వేద కాలేజీలో విద్యార్థిని ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్ వేధింపులకు గురిచేసి సస్పెన్షన్కు గురయ్యాడు. తాజాగా అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఎచ్చెర్ల మండలంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఓ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బరితెగించాడు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
8 సెమిస్టర్లు ఉన్నాయి.. కలిసి ప్రయాణం చేద్దాం..
"రేపు సెలవు కదా.. మా ఇంటికి వస్తావా. నువ్వు ఇంకా 8 సెమిస్టర్ల వరకు ఇక్కడే ఉంటావు.. వస్తే నీ ఇష్టం, మనిద్దరం కలిసి ప్రయాణం చేద్దాం" అంటూ ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. శ్రీకాకుళం బస్ కాంప్లెక్స్ దగ్గరకు వస్తే తానే స్వయంగా వచ్చి రిసీవ్ చేసుకుంటానని, తనను సార్ అని కాకుండా అండి అని పిలవాలని ఆ సంభాషణలో పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా, రేపు వచ్చాక అసలు విషయం చెప్తా. టైం వేస్ట్ చేయకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను.. ఐ వాంట్ యూ.. ఇకనుంచి నమం వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు కూడా షేర్ చేసుకుందాం అని ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినితో మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది.
ఈ వేధింపులపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్థిని విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్ను ఆధారంగా చూపించి తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ వ్యవహారం బయటకు పొక్కితే యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ రాజీ సమయంలో కూడా ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏమాత్రం తగ్గకుండా ‘నువ్వు ఇక్కడే చాలా సెమిస్టర్లు చదువుతావు. ఆ పరీక్షలు ఎలా పాస్ అవుతావో చూస్తానంటూ బాధిత విద్యార్థినిపై బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Author : Shankar Dukanam

