Dailyhunt
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత

Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత

ABP దేశం 1 week ago

Srisailam Ishtakameshwari Temple | శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ప్రముఖ ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

అటవీ శాఖ అధికారులకు, స్థానిక చెంచు డ్రైవర్లకు మధ్య తలెత్తిన వివాదమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులను ఆలయానికి తీసుకువెళ్లడానికి స్థానిక చెంచులు నడిపే జీపులను అటవీ శాఖ ఉపయోగిస్తోంది. అయితే ఇటీవల ఒక వ్యక్తి బైక్పై నేరుగా ఆలయానికి వెళ్లి రావడంతో వివాదం మొదలైంది.

రాతి విగ్రహమైనా నుదురు తాకితే మానవ చర్మమనే ఫీలింగ్..

ఈ వివాదం కారణంగా ఆలయానికి వెళ్లడానికి టికెట్లు తీసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన ఆలయ సిబ్బంది భక్తుల నుండి వసూలు చేసిన టికెట్ రుసుమును తిరిగి వారికి వెనక్కి ఇచ్చేశారు. అటవీ శాఖ అధికారులకు, చెంచు డ్రైవర్లకు మధ్య నెలకొన్న ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిన తర్వాతే ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను మళ్లీ పునఃప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. పార్వతీ దేవి అవతారమైన ఈ అమ్మవారు కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడి అమ్మవారి విగ్రహం రాతినైనా, నుదురు మానవ చర్మంలా మెత్తగా ఉంటుంది.

కోరిన కోర్కెలు తీర్చే తల్లి
శ్రీశైల అడవుల్లో కొలువైన ఇష్టకామేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో భక్తులకు దర్శనమిస్తారు. హస్తాలలో తామర మొగ్గలు, శివలింగం, రుద్రాక్షమాలను ధరించిన ఈ తల్లి రూపం గుహలోని దీపాల వెలుగులో చూసేసరికి భక్తుల హృదయాలు భక్తిపరవశంతో నిండిపోతాయి. ఇష్టకామేశ్వరి అనే పేరుకు తగ్గట్టుగానే, ఆ తల్లిని దర్శించుకుంటే భక్తులు మనసులో కోరుకున్న ఏ కోరికనైనా నెరవేరుస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే తమ ఆకాంక్షలు నెరవేరాలని భక్తులు దేశం నలుమూలల నుండి ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

పూర్వం సిద్ధులతో పూజలు అందుకున్న తల్లి

ఈ పవిత్ర ఆలయంలో పూర్వం సిద్ధులు మాత్రమే పూజలు చేసేవారని చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుతం స్థానిక చెంచు గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిరోజూ అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉండి, ధ్యానానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ కాసేపు కూర్చుని ధ్యానం చేసుకుంటే మనసుకు అపూర్వమైన ప్రశాంతత లభిస్తుంది. అందువల్ల శ్రీశైల యాత్రకు వచ్చే భక్తులు తప్పకుండా ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని తీరాలని భక్తులు నమ్ముతారు.

శ్రీశైలం క్షేత్రంలో దర్శనీయ ప్రదేశాలు ఇవే

నల్లమల అడవులలో కృష్ణా నది ఒడ్డున ఉన్న శ్రీశైలం ఒక ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామి (ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి)తో పాటు భ్రమరాంబా దేవి (అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి) కొలువై ఉన్నారు. ఇది చారిత్రక ప్రాధాన్యత, ఆధ్యాత్మికత కలగలిసిన క్షేత్రం. శ్రీశైలాన్ని భూకైలాసంగా భక్తులు భావిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం, భ్రమరాంబా దేవి ఆలయం, సాక్షి గణపతి ఆలయం, శిఖరేశ్వర ఆలయం, శ్రీశైలం డ్యామ్, పాతాళగంగ, అక్కిమహాదేవి గుహలు, నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ లాంటి దర్శనీయ, చారిత్ర క స్థలాలు ఉన్నాయి.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam