రోజంతా తీవ్రమైన పని చేస్తే.. రాత్రి పడుకునేసరికి శరీరం చాలా అలసిపోతుంది. ఆ సమయంలో బాడీ రెస్ట్ కోరుకుంటంది. కానీ మైండ్ యాక్టివ్‌గా ఉండి నిద్ర రానివ్వదు.
బదులుగా మరింత చురుకుగా మారి.. పాత ఆలోచనలు, భవిష్యత్తు గురించిన ఆందోళన, అనవసరమైన విషయాలు మనసులో తిరిగేలా చేస్తుంది. దీనివల్ల నిద్రపోవడం కష్టమవుతుంది. ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట అతిగా ఆలోచించడం, నిద్రలేమి సమస్య సాధారణమైనది లేదా ఆకస్మికమైనది కాదని అంటున్నారు. దీని వెనుక మనసు, శరీరం, ఒత్తిడికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో.. ఆలోచనలకు చెక్ పెట్టి.. నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవాలో చూసేద్దాం.
డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్..
రాత్రిపూట మెదడులోని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే భాగం చురుకుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతం స్వీయ విశ్లేషణకు, గడిచిన, భవిష్యత్ గురించి ఆలోచించడానికి బాధ్యత వహిస్తుంది. ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడే వ్యక్తులలో.. ఈ ప్రక్రియ మరింత తీవ్రమవుతుంది. వారికి పదేపదే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఈ కారణంగానే నిద్రలో కూడా మెదడు ప్రశాంతంగా ఉండలేదు.
కార్టిసాల్ లెవెల్స్..
రాత్రిపూట శరీరం క్రమంగా విశ్రాంతి తీసుకుంటుంది. కానీ నిద్రలేమితో బాధపడేవారిలో ఒత్తిడికి సంబంధించిన వ్యవస్థ చురుకుగా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు అధికంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఇంకా ఒత్తిడిలో లేదా ముప్పులో ఉన్నట్లు భావిస్తుంది. ఇది నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది.
కెమికల్స్ బ్యాలెన్స్ తప్పితే..
మంచి నిద్రకు మెదడులోని కొన్ని కెమికల్స్ బ్యాలెన్స్ అవసరం. వీటిలో కొన్ని మనసును ప్రశాంతపరిస్తే.. మరికొన్ని దానిని మేల్కొని ఉండేలా చేస్తాయి. ఈ సమతుల్యతకు భంగం కలిగినప్పుడు.. మెదడు విశ్రాంతి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. దీనివల్ల ఆలోచనలు, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
నిద్రలేమి మెదడులోని నిర్ణయాలు తీసుకునే, ఎమోషన్స్ నియంత్రించే భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చిన్న విషయాలు కూడా పెద్దవిగా, మరింత బాధాకరంగా అనిపించవచ్చు. ఈ ప్రభావం రాత్రిపూట మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ఆందోళన, అతిగా ఆలోచించనలు పెరగడానికి కారణమవుతుంది.
జీర్ణ సమస్యలు..
జీర్ణ వ్యవస్థకు, మెదడుకు మధ్య గాఢమైన సంబంధం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. జీర్ణాశయ సంబంధిత సమస్యలు లేదా ఇబ్బందులు ఉంటే.. అది మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే జీర్ణ సమస్యలు, నిద్ర సమస్యలు తరచుగా కలిసి కనిపిస్తాయి.
మరిన్ని మిస్టేక్స్..
నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రోజువారీ అలవాట్లు కూడా రాత్రిపూట మనసు ప్రశాంతంగా ఉండకుండా చేస్తాయి. అవేంటంటే.. రోజూ ఒకే సమయానికి పడుకోకపోవడం, పొద్దుపోయే వరకు మొబైల్ ఫోన్లు లేదా స్క్రీన్లను ఉపయోగించడం, మద్యం సేవించడం లేదా కొన్ని రకాల మందులు తీసుకోవడం వంటివి స్లీప్ సైకిల్‌ను దెబ్బతీస్తాయి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను గణనీయంగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నిద్రపోయే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవడం, తేలికపాటి వ్యాయామం, ధ్యానం లేదా నిద్ర సమస్యకు వైద్యుడి సహాయంతో మందులు తీసుకోవడం వంటివన్నీ సహాయపడతాయి. సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ఆలోచనలు దూరం చేసి.. ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
Author : Geddam Vijaya Madhuri

