Dailyhunt
Tamil Nadu Assembly Election Results: బంగారం నుంచి గ్యాస్ సిలిండర్ల వరకూ - విజయ్‌ను గెలిపించిన మేనిఫెస్టో ఇదే !

Tamil Nadu Assembly Election Results: బంగారం నుంచి గ్యాస్ సిలిండర్ల వరకూ - విజయ్‌ను గెలిపించిన మేనిఫెస్టో ఇదే !

ABP దేశం 5 days ago

Tamil Nadu Assembly Election Results TVK manifesto: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోయింది. అయితే ఇతర పార్టీలు కలసి వస్తాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనం కావచ్చు.

అందుకే ఇప్పుడు విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో మరోసారి వైరల్ అవుతోంది. డీఎంకే, అన్నాడీఎంకేలకు ధీటుగా, అత్యంత ప్రజారంజకమైన హామీలతో విజయ్ మేనిఫెస్టో ప్రకటించారు.

మహిళా సంక్షేమం - సరికొత్త వరాలు

విజయ్ తన మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా భారీ హామీలు గుప్పించారు. కుటుంబ యజమానులైన మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం, పేద కుటుంబాల్లోని వధువులకు 8 గ్రాముల బంగారం తో పాటు పట్టుచీర పంపిణీ వంటి హామీలు మహిళల్లో ఉత్సాహం నింపాయి. వీటితో పాటు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు మేనిఫెస్టోలో ఉన్నాయి.

యువతకు ఉపాధి - ఏఐ పాలన

నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా టీవీకే మేనిఫెస్టోలో కీలక ప్రకటనలు చేశారు. నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 4,000**, డిప్లొమా హోల్డర్లకు 2,000 భృతిని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, మరో 5 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఏఐ మంత్రిత్వ శాఖ , ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ లను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విజయ్ ముందుచూపుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

రైతులకు భరోసా - గిట్టుబాటు ధరలు

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతుల రుణమాఫీపై విజయ్ కీలక హామీ ఇచ్చారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు సహకార రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి 50% మాఫీ చేస్తామని ప్రకటించారు. వరికి క్వింటాల్‌కు 3,500 , చెరకు టన్నుకు 4,500 మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు సైతం కల్టివేటర్ రైట్స్ కార్డ్ ద్వారా ఏటా రూ. 10,000 సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

విద్య పరిపాలన సంస్కరణలు

విద్యారంగంలో సమూల మార్పుల కోసం వంద కామరాజర్ స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను అరికట్టేందుకు విద్యార్థుల తల్లులకు ఏటా రూ.15,000 అందజేస్తామని హామీ ఇచ్చారు. పాలనలో పారదర్శకత కోసం సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్, సర్వీస్ యాక్ట్ ద్వారా ప్రభుత్వ సేవలను నిర్ణీత గడువులోగా ప్రజలకు అందేలా చేస్తామని విజయ్ వాగ్దానం చేశారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామనే హామీ మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటగా మారింది. కచ్చతీవును తిరిగి స్వాధీనం చేసుకోవడం, పోలీసుల జీతాల పెంపు, అంగన్‌వాడీలకు ప్రత్యేక గౌరవ వేతనం వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చారు.

ఈ హామీలన్నీ అమలు చేయడం విజయ్‌కు అంత తేలిక కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam