Governor not inviting Vijay to form government: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
విజయ్ నేతృత్వంలోని టీవీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికార పీఠాన్ని అందుకోవడానికి అవసరమైన స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ను నిరూపించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
గవర్నర్ ఆచితూచి అడుగు - సంఖ్యాబలమే ప్రాధాన్యం
టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, ప్రస్తుతానికి కేవలం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కాంగ్రెస్తో కలిపి ఉన్నందున, 118 మంది మ్యాజిక్ మార్కును చేరుకున్నాకే ప్రమాణ స్వీకారానికి రావాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. అతిపెద్ద పార్టీగా విజయ్ను ఆహ్వానించే వెసులుబాటు ఉన్నప్పటికీ, సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే మెజారిటీకి అవసరమైన సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్ కోరుతున్నారు.
విజయ్.. కాంగ్రెస్ మాత్రమే తోడు
కూటమి రాజకీయాల్లో విజయ్ ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. డీఎంకే కూటమి నుంచి బయటకు వస్తాయనుకున్న వామపక్షాలు, విడుతలై చిరుతైగల్ కట్చి , ముస్లిం లీగ్ వంటి పార్టీలు తాము డీఎంకేతోనే ఉంటామని ప్రకటించాయి. దీంతో విజయ్కు ప్రస్తుతం కాంగ్రెస్లోని ఐదుగురు ఎమ్మెల్యేలు తప్ప మరే ఇతర ప్రధాన పార్టీ మద్దతు లభించలేదు. సిద్ధాంతపరంగా భిన్నమైన అన్నాడీఎంకే మద్దతు కూడగట్టడం కూడా విజయ్కు అగ్నిపరీక్షగా మారింది.
వ్యూహ ప్రతివ్యూహాల్లో అన్నాడీఎంకే
ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నా, పార్టీ అధినేత పళనిస్వామి మాత్రం ఇప్పటికీ మౌనం పాటిస్తున్నారు. ఒకవేళ అన్నాడీఎంకే గనుక మద్దతు ఇవ్వకుంటే, విజయ్ ప్రభుత్వం ఏర్పడినా అది స్వల్పకాలికంగానే ఉండే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సింగిల్ నినాదంపై విమర్శలు
ఎన్నికల ప్రచారంలో ద్రావిడ పార్టీల అవసరం లేదని, ఒంటరిగానే పోరాడతానని చెప్పిన విజయ్.. ఇప్పుడు మెజారిటీ కోసం ఇతర పార్టీల వాకిట నిలబడటంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్తో చేతులు కలపడం ఆయన స్వయంశక్తి నినాదానికి విరుద్ధమని డీఎంకే శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. అధికార దాహంతోనే విజయ్ తన రాజకీయ విలువలను పక్కన పెట్టారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
చెన్నైలో ఉత్కంఠ - గడువు దగ్గర పడుతుండటంతో..
ప్రభుత్వ ఏర్పాటుకు గడువు సమీపిస్తుండటంతో విజయ్ తన క్యాంపును పటిష్టం చేసే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలతో పాటు, స్వతంత్రులతోనూ రాయబారాలు నడుపుతున్నారు. మరోవైపు పరాజయం పాలైన డీఎంకే, ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష హోదాలో బలమైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద తమిళనాడులో విజయ్ పట్టాభిషేకం జరుగుతుందా లేక రాజకీయ అనిశ్చితి నెలకొంటుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Author : Raja Sekhar Allu

