Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?

TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?

ABP దేశం 1 week ago

Telugu Desam Party Bigwigs Switching Parties: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికల సందడి ఊపందుకుంది. రాష్ట్రంలో కూటమికి ఉన్న భారీ మెజారిటీ కారణంగా ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలనూ కైవసం చేసుకోవడం నల్లేరుపై నడకే.

అయితే, ఈ విజయోత్సాహం నడుమ పార్టీలో ఒక ఆసక్తికరమైన, పాత వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. 1984 లో ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు పెద్దల సభకు వెళ్లిన నేతల చరిత్రను గమనిస్తే.. రాజ్యసభ సభ్యులు టీడీపీకి ఎప్పుడూ కలిసి రాలేదు అనే సెంటిమెంట్ క్యాడర్లో బలంగా వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు దాదాపు 46 మంది నేతలు ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ సుదీర్ఘ చరిత్రలో ఒక చేదు నిజం పార్టీని నిరంతరం వెంటాడుతోంది. టీడీపీ తరఫున ఒకసారి కంటే ఎక్కువసార్లు రాజ్యసభకు వెళ్లిన నేతలలో అత్యధికులు కీలక సమయంలో పార్టీకి హ్యాండ్ ఇచ్చి వలస బాట పట్టారు. నాడు ఎన్టీఆర్ హయాంలో పార్టీలో అత్యంత కీలక చక్రం తిప్పిన పి. ఉపేంద్ర కాలం నుంచి.. నిన్నమొన్నటి సుజనా చౌదరి, సీఎం రమేష్ వరకు ఈ జాబితా చాలా పెద్దదిగానే ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన ఈ పెద్దలు .. సొంత ప్రయోజనాల కోసం లేదా కేసుల భయంతో పార్టీ లైన్ దాటడం ప్రతిసారీ క్యాడర్ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

కష్టకాలంలో విలీన పోటు

టీడీపీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న 2019 ఎన్నికల తర్వాత ఈ రాజ్యసభ సభ్యుల వలసలు పరాకాష్టకు చేరాయి. అప్పట్లో టీడీపీకి ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు సుజనా చౌదరి, సి.ఎం. రమేష్, టి.జి. వెంకటేష్, గరికపాటి మోహన్ రావు ఒకేసారి గ్రూప్గా మారి, రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని ఏకంగా బీజేపీలో విలీనం చేసేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం రెండు పైగా మూడు వంతుల మెజారిటీని వాడుకుని, అనర్హత వేటు పడకుండా వీరు సేఫ్గా కమలం గూటికి చేరిపోయారు. అంతకుముందు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులుగా, ఢిల్లీలో పార్టీ ముఖచిత్రాలుగా వెలిగిన వీరే.. పార్టీ ఓడిపోగానే పక్కదారి పట్టడం చంద్రబాబు రాజకీయ వ్యూహాల లోపాన్ని ఎత్తిచూపింది.

తెర వెనుక నేతలకే ప్రాధాన్యత?

ఈ వరుస వలసల వెనుక ఉన్న అసలు కారణంపై టీడీపీ క్షేత్రస్థాయి క్యాడర్, సీనియర్ లీడర్లలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎలక్షన్ల సమయంలో పార్టీ గెలుపు కోసం రాత్రింబవళ్లు లాఠీ దెబ్బలు తింటూ, జైళ్లకు వెళ్లే గ్రౌండ్ లెవెల్ లీడర్లను పక్కన పెట్టి.. కేవలం ఫండింగ్ చేసేవారికి, తెర వెనుక చక్రం తిప్పే కార్పొరేట్ శక్తులకే చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇస్తారనే విమర్శ మొదటి నుండి ఉంది. ఢిల్లీలో లాలీచీలు నడపడానికి, వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడానికి వచ్చే ఇలాంటి పారాచూట్ నేతలకు పార్టీ సిద్ధాంతాల పట్ల గానీ, కార్యకర్తల కష్టం పట్ల గానీ ఎలాంటి నిబద్ధత ఉండదు. అందుకే, అధికారం మారగానే వీరు తమ వ్యాపారాలను, కాంట్రాక్టులను కాపాడుకోవడానికి అధికార పార్టీలోకి జంప్ అయిపోతుంటారని క్యాడర్ గట్టిగా నమ్ముతోంది.

ప్రస్తుతం జూన్ 2026 లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో మళ్లీ లాబీయింగ్ మొదలైంది. కూటమి ఒప్పందంలో భాగంగా జనసేనకు ఒక సీటు కేటాయించగా, మిగిలిన మూడు సీట్లు టీడీపీ దక్కించుకోనుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న సానా సతీష్ బాబు తో పాటు పాత కార్పొరేట్ ముఖాలు మళ్లీ సీట్ల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈసారి నారా లోకేష్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుండటంతో.. యువతకు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న బీసీ, ఎస్సీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాత తప్పులను పునరావృతం చేయవద్దని కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

మార్పు అవసరం

ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో తన వాయిస్ బలంగా వినిపించాలంటే రాజ్యసభ సభ్యుల పాత్ర కీలకం. కానీ టీడీపీ విషయంలో ఈ సభ్యులు కేవలం పవర్ బ్రోకర్లు గా మిగిలిపోతున్నారనేది నిజం. సురేష్ ప్రభు లాంటి బయటి వ్యక్తులకు కూడా గతంలో టీడీపీ సీటు ఇచ్చింది. ఈ ధోరణి మారకపోతే, భవిష్యత్తులో కూడా ఈ సీట్లు పార్టీకి కేవలం తాత్కాలిక అవసరాలకే ఉపయోగపడతాయి తప్ప, నమ్మకమైన లీడర్షిప్ను తయారు చేయలేవు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో కేవలం ఆర్థిక అంగబలాన్ని మాత్రమే చూడకుండా, రాజకీయ అంగబలం, నమ్మకమైన చరిత్ర ఉన్నవారికే పెద్దల సభకు పంపితేనే ఈ రాజ్యసభ శాపం నుంచి టీడీపీ బయటపడగలదని టీడీపీ క్యాడర్ అభిప్రాయం.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam