Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Cabinet Reshuffle: కొండా సురేఖ వివాదం కాంగ్రెస్‌లో సునామీగా మారుతోందా? తిరుగుబాటు దేనికి సంకేతం?

Telangana Cabinet Reshuffle: కొండా సురేఖ వివాదం కాంగ్రెస్‌లో సునామీగా మారుతోందా? తిరుగుబాటు దేనికి సంకేతం?

ABP దేశం 1 week ago

Telangana Congress Politics: తెలంగాణ మంత్రివర్గంలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించడం దాదాపు ఖాయమైనట్లేనని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయి పార్టీ క్రమశిక్షణ, మంత్రి వైఖరిపై స్పష్టమైన సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె చేత ముందే రాజీనామా చేయించాలా లేక రాబోయే కేబినెట్ విస్తరణలో భాగస్వామ్య మార్పుగా చూపి గౌరవంగా పక్కన పెట్టాలా అనే అంశంపైనే అధిష్టానం కసరత్తు చేస్తోంది.

తగ్గేదిలేదంటున్న సురేఖ

ఈ వివాదానికి ప్రధాన కారణం మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత కాంగ్రెస్ నాయకత్వం , సీఎం రేవంత్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని చేసిన తీవ్రమైన వ్యాఖ్యలే . ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఈ వ్యవహారంపై నివేదికను సేకరించి అధిష్టానానికి నివేదించింది. కేవలం ఒక బీసీ మహిళా మంత్రిపైనే వేటు వేస్తే సమాజంలో లేదా పార్టీ వర్గాల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే భావనతో, ఈ మార్పును కేవలం సురేఖ తొలగింపుగా కాకుండా పూర్తి స్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణగా చూపించేందుకు కాంగ్రెస్ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు.

బీసీ నినాదంతో సురేఖ

మరోవైపు, ఈ పరిణామాలను కొండా దంపతులు తేలిగ్గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. తాము దశాబ్దాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించామని, తమను కేబినెట్ నుంచి ఏకపక్షంగా తొలగిస్తే ఊరుకునేది లేదని వారు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ బలవంతంగా పదవి నుంచి తప్పిస్తే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వరంగల్ ఈస్ట్ స్థానానికి ఉపఎన్నిక తీసుకువచ్చే ధోరణిలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయం. కాంగ్రెస్ అధిష్టానానికి ఇది అత్యంత క్లిష్టమైన సమస్యగా మారింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకురాలిగా ఉన్న కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిలు కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని విమర్శించే అవకాశం ఉంది. ఈ రాజకీయ నష్టాన్ని భర్తీ చేసేందుకే మన్నూర్ కాపు సామాజిక వర్గానికే చెందిన విప్ ఆది శ్రీనివాస్ లేదా ఇతర సీనియర్ బీసీ నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కేబినెట్ రేసులో పలువురు

ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ వంటి ఇతరుల ప్రవేశంపై కూడా ఊహాగానాలు సాగుతుండటంతో, కేవలం ఒకే మంత్రిని టార్గెట్ చేశారనే భావనను తగ్గించేందుకు అధిష్టానం శ్రమిస్తోంది. అయితే కొండా దంపతుల తిరుగుబాటు నైజం తెలిసిన కాంగ్రెస్ పెద్దలు, ఆమెను అసంతృప్తికి గురికాకుండా ఇతర కీలక నామినేటెడ్ పోస్టుతో నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా సమాంతరంగా సాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన పాలనాపరమైన, పార్టీ పరమైన పట్టును నిరూపించుకోవడానికి ఈ నిర్ణయం కీలకంగా మారింది. ఒకవేళ కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించి, ఆమె తిరుగుబాటు బావుటా ఎగరేస్తే తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విబేధాలు రచ్చకెక్కడం ఖాయం. రాబోయే ఢిల్లీ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam