Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana paddy cultivation reduction: తెలంగాణ  వరికి కేంద్రం బ్రేక్ - 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింపు టార్గెట్.. రైతులకు పంటల మార్పిడి సెగ!

Telangana paddy cultivation reduction: తెలంగాణ వరికి కేంద్రం బ్రేక్ - 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింపు టార్గెట్.. రైతులకు పంటల మార్పిడి సెగ!

ABP దేశం 1 week ago

Oil palm and pulses cultivation Telangana: తెలంగాణ గడ్డపై పారుతున్న జలకళతో వరి సాగు రికార్డులు సృష్టిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి కళ్లెం వేసేందుకు సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా వరి సాగును తగ్గించి, ఆ స్థానంలో నూనెగింజలు, పప్పుధాన్యాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రం భారీ ప్రణాళికను ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఎకరాల్లో వరి సాగును తగ్గించాలని నిర్ణయించగా, అందులో ఏకంగా 10 శాతం అంటే 25 లక్షల ఎకరాలు బాధ్యతను ఒక్క తెలంగాణకే అప్పగించడం ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ రంగంలో కలకలం రేపుతోంది.

తెలంగాణపైనే ఎందుకు ఈ భారం?

గడిచిన మూడేళ్లలో తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 16 లక్షల ఎకరాల మేర పెరిగి, ప్రస్తుతం 133 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఏటా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. యాంత్రీకరణ పెరగడం, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఉండటంతో పాటు రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ. 500 బోనస్ పథకం రైతులకు వరిపై మరింత మక్కువ పెంచింది. ఫలితంగా కేంద్ర గోదాముల్లో ధాన్యం నిల్వలు నిండిపోయి, కొత్త పంటను నిల్వ చేసేందుకు స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల చొప్పున వరిని తగ్గించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

ధాన్యం ఎక్కువ.. పప్పులు తక్కువ!

రాష్ట్రంలో ఒకవైపు వరి నిల్వలు పేరుకుపోతుంటే, మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మన అవసరాలకు సరిపడా ఇవి ఇక్కడ ఉత్పత్తి కాకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే వరిని తగ్గించి, ఆ భూముల్లో ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు , వాణిజ్య పంటలు వేయడం ద్వారా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించవచ్చని కేంద్రం సూచిస్తోంది.

రైతులకు సవాల్గా మారనున్న పంటల మార్పిడి

అయితే, దశాబ్దాలుగా వరి సాగుకే అలవాటు పడిన రైతులకు ఇది పెద్ద పరీక్షగా మారనుంది. వరి పంటకు ఉన్న మార్కెటింగ్ సౌకర్యం, నీటి లభ్యత ఇతర పంటలకు ఉంటుందా? అన్నది రైతుల ప్రధాన సందేహం. కేవలం ఆదేశాలతోనే వరి సాగు తగ్గదని, ప్రత్యామ్నాయ పంటలకు గ్యారెంటీ ధర స కొనుగోలు భరోసా కల్పిస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన ఈ భారీ టార్గెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వరి తగ్గించి ఇతర పంటల వైపు రైతులను మళ్లించడం వల్ల మార్కెట్లో సమతుల్యత వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులను ఒప్పించడం అంత సులభం కాకపోవచ్చు. ఏదేమైనా, తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు వరి నీడ నుంచి బయటకు వచ్చి వాణిజ్య బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam