Telangana Police vs AP Police:హైదరాబాద్లో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు సంచలనం సృష్టించాయి. ఏపీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేయడమే కాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఇప్పుడు న్యాయపరమైన మలుపు తిరిగాయి.
పోలీసులపై కేసు నమోదు చేసే వరకు సిచ్యుయేషన్ వెళ్లింది.
మంగళవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో హైదరాబాద్లోని బైరామల్గూడ, మధురానగర్లో నివసిస్తున్న కేవీ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి ఓ టీం వచ్చి ఆయన్ని విచారించింది. సాధారణ దుస్తుల్లో, ప్రైవేటు వాహనంలో వచ్చి పోలీసులు కేవీ రెడ్డిని తీసుకెళ్లారు. ఆయన్ని బలవంతంగా లాక్కెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కనీసం దుస్తులు మార్చుకునేంత టైం కా ఇవ్వలేదని ఆరోపించారు. అడ్డుగా వచ్చిన తనపై అనుచితంగా ప్రవర్తించారని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థానికులు వెంటనే స్పందించి ఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు అక్కకడికి చేరుకొని ఏపీ పోలీసులను, విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్క బాధితురాలి ఫిర్యాదు మేరకు బొబ్బిలి సీఐ శ్రీనివాస్, ఇతర సిబ్బందిపై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించారనే ఆరోపణలతో సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై కేవీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కామెంట్స్ చేశారు. విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్ కండి రమేష్ దీనిపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 10న కేవీ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో బీఎన్ఎస్ సెక్షన్లు 152, 197, 296, 353, 352తోపాటు ఐటీ యాక్ట్67, 67(ఏ) కింద కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మే 5న కోర్టు కేవీ రెడ్డి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ఆధారంగానే ఏపీ పోలీసులు అరెస్టుకు వచ్చామని పేర్కొన్నారు.
రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటి పోలీసులు అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచార ఇవ్వాలి, కానీ ఈ కేసులో ఏపీ పోలీసులు, ప్రైవేట్ వాహనాల్లో సివిల్ డ్రస్లో వచ్చి కేవీ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లడం చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన అని విమర్శలు వస్తున్నాయి.
కేవీ రెడ్డిపై నమోదు చేసిన ఐటీ యాక్ట్ సెక్షన్లు, బీఎన్ఎస్ సెక్షన్ల తీవ్రతను బట్టి చూస్తే ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని బాధితుడి కుటుంబం వాదిస్తోంది.
Author : Khagesh

