Andhra vs Telangana Identity Debate: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఒక విచిత్రమైన ఎజెండా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాబోయే ఎన్నికల కోసం ప్రజలను ఆకట్టుకునే బలమైన సామాజిక, ఆర్థిక అజెండాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో ప్రధాన రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి.
అయితే, క్షేత్రస్థాయిలో చూపించడానికి కొత్త విషయాలేవీ దొరక్కపోవడంతో.. పార్టీలు మళ్లీ పాత, నమ్మకమైన ‘తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్నే భుజానికెత్తుకుంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పుష్కరం దాటిన తర్వాత కూడా.. ఇంకా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, భాషపై దాడి జరుగుతోందని స్థానిక పాలకుల మీదే నిందలు వేసే రాజకీయాలు చేయడం.. నేటి తరం ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సినిమా టైటిల్పై సోషల్ మీడియా ట్రోల్స్.. సెంటిమెంట్గా మార్చిన నేతలు!
ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఏ స్థాయికి వెళ్లాయో చెప్పడానికి తాజా ఇడుపు కాయితం సినిమా వివాదమే ఒక పెద్ద ఉదాహరణ. నటుడు ప్రియదర్శి హీరోగా అచ్చమైన తెలంగాణ గ్రామీణ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో ఎవరో ఇద్దరు నెటిజన్లు దీనికి ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ అవసరమా? అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. అసలు ‘ఇడుపు కాయితం’ అంటే తెలంగాణ యాసలో విడాకుల దరఖాస్తు లేదా ఆలుమగలు విడిపోయే ముందు రాసుకునే అంగీకార పత్రం అని అర్థం . కేవలం కొందరు నెటిజన్లు చేసిన వెకిలి చేష్టలను , అజ్ఞానపు ట్రోల్స్ను పట్టుకుని.. రాజకీయ పార్టీలు, మేధావుల బృందాలు దానిని ఏకంగా తెలంగాణ అస్థిత్వం, యాసపై ఆంధ్రా వాళ్ల దాడి అంటూ ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
స్వపాలనలో ఆంధ్రాపై విమర్శలా?
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రా పాలకులు-వలసవాదం అనే నినాదం ప్రజలను విపరీతంగా కదిలించింది. ఎందుకంటే అప్పట్లో అధికారం, నిధులు, నియామకాలు వేరే చేతుల్లో ఉండేవి. కానీ, రాష్ట్రం వచ్చి పుష్కరం దాటిన ఈ తరుణంలో.. ఇక్కడి సీఎం, మంత్రులు, అధికార యంత్రాంగం అంతా స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలే అయినప్పుడు.. ఇంకా ఆంధ్రా వలసవాదం అంటూ సెంటిమెంట్ను రాజేయడం హాస్యాస్పదంగా మారుతోంది. తెలంగాణలో జరుగుతున్న తప్పులకు లేదా పాలనా వైఫల్యాలకు ఇక్కడి పాలకులదే బాధ్యత కానీ.. ప్రతి చిన్న విషయానికి, చివరకు సినిమా టైటిల్ వివాదాలకు కూడా ఆంధ్రా ప్రాంతాన్ని లాగడం ప్రజలను కదిలించే అవకాశం లేదు. నేటి ఓటర్లు నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఐటీ వృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి క్షేత్రస్థాయి ఫలితాలను చూస్తున్నారే తప్ప.. సెంటిమెంట్ సెంటిమెంట్ అని రోజూ రొట్టె దంచితే వినే పరిస్థితిలో లేరని ఎక్కువ మంది భావిస్తున్నారు.
ఆంధ్రా పార్టీలు ఉనికిలోనే లేవు.. మరి ఈ నినాదం వ్యూహాత్మక తప్పిదమా?
ప్రస్తుత తెలంగాణలో ఒకప్పుడు శాసించిన తెలుగుదేశం గానీ, వైఎస్సార్ కాంగ్రె గానీ కనీసం ఉనికిలో కూడా లేవు. షర్మిలా పార్టీ కాంగ్రెస్లో విలీనమైపోయింది. ఇక్కడ అధికారం కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఈ మూడు పార్టీల నేతలూ తెలంగాణ వారే. మరి శత్రువే లేనప్పుడు తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో పడింది.. ఆంధ్రా వాళ్లు దోచుకుంటున్నారు అనే నినాదాన్ని ఎత్తుకోవడం ముమ్మాటికీ రాజకీయ పార్టీల వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. శత్రువును సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే పాత చింతకాయ పచ్చడి వ్యూహాలు ఇప్పుడు పనిచేయవని అంచనా వేస్తున్నారు.
సెంటిమెంట్ కాలం చెల్లింది.. కావాల్సింది ప్రగతి అజెండా!
ఒక సినిమా టైటిల్ మీదో, లేక ఎవరో యూట్యూబర్ చేసిన వ్యాఖ్యల మీదో ఆధారపడి రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయ విభేదాలు, అస్థిత్వ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు.. కేవలం పార్టీల సొంత రాజకీయ మనుగడ కోసమేనని నెటిజన్లు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ సమాజం ఉద్యమ కాలం నాటి భావోద్వేగాల నుండి ఎప్పుడో బయటకు వచ్చేసింది. గ్లోబల్ సిటీగా మారిన హైదరాబాద్ అభివృద్ధిని, యువత ఉపాధిని కాపాడుకోవడమే నేటి ప్రాధాన్యత. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఈ పాత సెంటిమెంట్ కార్డును పక్కనబెట్టి.. నిరుద్యోగ నివారణ, పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ సంక్షేమం వంటి కంటికి కనిపించే ప్రగతి అజెండా తో వస్తేనే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు, లేదంటే ప్రజలే ఆ పార్టీలకు ఇడుపు కాయితం రాసిస్తారన్న అభిప్రాయాలు ఎక్కువ మంది వినిపిస్తున్నారు.
Author : Raja Sekhar Allu

