Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVK Vijay: కమల్‌ వల్ల కాలేదు... రజనీ రాలేదు... 60 ఏళ్ళ ద్రావిడ ప్రభుత్వాలను విజయ్ ఎలా ఓడించాడు? సక్సెస్ ఫార్ములా ఏంటి?

TVK Vijay: కమల్‌ వల్ల కాలేదు... రజనీ రాలేదు... 60 ఏళ్ళ ద్రావిడ ప్రభుత్వాలను విజయ్ ఎలా ఓడించాడు? సక్సెస్ ఫార్ములా ఏంటి?

ABP దేశం 2 months ago

Tamil Nadu Assembly Election 2026 Results:తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే... గత 60 ఏళ్లుగా ద్రావిడ పార్టీలదే ఆధిపత్యం. జాతీయ పార్టీలు సైతం తమిళనాడులో జెండా ఎగరేయడానికి కష్టపడ్డాయి. కానీ, ఫలితాలు పూర్తిగా జాతీయ జెండాలకు అనుకూలంగా రాలేదు.

తమిళ రాష్ట్రంలో అధికారం ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య దోబూచులాడింది. సుమారు 60 ఏళ్ళుగా అధికారం తమ దగ్గర పెట్టుకుని అనుభవిస్తున్న ఆ పార్టీల పునాదులను దళపతి విజయ్ స్థాపించిన 'టీవీకే' పార్టీ పెకిలించి వేసింది.

తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుంధుబి మోగించింది విజయ్ అలియాస్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' పార్టీ. రాజకీయాల్లోకి విజయ్ అడుగు పెట్టినప్పుడు, కొత్త పార్టీని ప్రకటించినప్పుడు... ఆయన్ను గానీ, పార్టీని గానీ ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. విజయ్ రీల్ లైఫ్ హీరో మాత్రమేనని, రియల్ లైఫ్ హీరో అవ్వలేరని అంచనా వేశారు. అయితే... అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ రియల్ లైఫ్‌లోనూ విజయ్ ఎలా హీరో అయ్యారు? ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటి? అనేది చూస్తే...

ఉపాధి, విద్య, మెరుగైన పాలన ఇస్తానని...
విజయ్ విజయంలో కీలక పాత్ర పోషించినది యువత అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. తమిళనాడులోని ద్రావిడ రాజకీయాల్లోని అవినీతి ఆరోపణలు, పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. వాళ్ళు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూశారు. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న ఎం.కె. స్టాలిన్, ఆయన పార్టీ హిందీ వ్యతిరేక రాజకీయం చేసింది. సనాతన ధర్మం మీద విరుచుకు పడింది. అయితే... విజయ్ ఆ అంశం వైపు వెళ్ళలేదు. తాను స్టాలిన్ పార్టీని టార్గెట్ చేసినప్పుడు అవినీతిని ప్రస్తావించారు. ఉపాధి, విద్య, మెరుగైన పాలన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పట్టణ, యువ ఓటర్లకు విజయ్ ప్రాధాన్యత చేరువైంది. దాంతో ఆయనకు పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వాళ్ళ ఆకాంక్షలు ఏమిటనేది స్పష్టంగా కనిపించింది.

కొత్త నాయకులకు తోడు మహిళలు మద్దతు!
తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో యువత, మహిళలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు కీలక పాత్ర పోషిస్తారని ముందు నుంచి ఉన్న అంచనా. అది విజయ్ పసిగట్టారు. సాంప్రదాయ రాజకీయాలకు చెల్లు చీటీ పాడారు. తన పార్టీలో కొత్త ముఖాలకు అవకాశాలు కల్పించారు. తన డ్రైవర్ కొడుక్కి టికెట్ ఇవ్వడం కూడా కలిసొచ్చింది. దానికి తోడు మహిళల మద్దతు కూడా విజయ్ పార్టీకి లభించింది. తమిళనాడులో మహిళల భద్రత, సామాజిక సమస్యలు సైతం కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు విజయ్ పార్టీకి కలిసి వచ్చింది.

అవినీతి, నిరుద్యోగం, కుల రాజకీయాలూ...
టీవీకే పార్టీ, విజయ్ విజయంలో గత ప్రభుత్వాల అవినీతి, ఆయా ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన నిరుద్యోగం వంటివి సైతం ప్రముఖ పాత్ర పోషించాయి. విజయ్ తన ప్రచారంలో అవినీతి, నిరుద్యోగం వంటి వాటిని ప్రముఖంగా ప్రస్తావించారు. మార్పు అనివార్యమని చెప్పారు. వాటిని ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలుగా చేసుకున్నారు. తమిళ ఆత్మగౌరవాన్ని కూడా ఆయన ప్రోత్సహించినా... దానిని అభివృద్ధితో ముడి పెట్టారు.

Also Read: SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

విజయ్ క్రిస్టియన్ అనే అంశాన్ని కొందరు ప్రస్తావించారు. అయితే... ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. ఆయన్ను మార్పుకు చిహ్నంగా చూశారు. విజయ్ కూడా కుల ఆధారిత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లారు. తాను అందరివాడిని అని నిరూపించుకున్నారు. విభజన రాజకీయాలతో విసిగిన తమిళ ప్రజలు, కొన్నేళ్లుగా గత పార్టీలను గమనిస్తున్న వ్యక్తులకు విజయ్ నచ్చాడు.

ఒంటరిగా నిలబడి, పార్టీలతో కలబడి...
విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. ఆయనతో కలవడానికి కొంత మంది ఆసక్తి కనబరిచినప్పటికీ... విజయ్ ఒంటరి పోరుకు మొగ్గు చూపారు. ఎన్నికలకు ముందు ప్రచారంలో కరూర్ తొక్కిసలాట జరిగింది. 'జన నాయగన్' విడుదలకు ఆటకం ఏర్పడింది. అయినా సరే విజయ్ వెనక్కి తగ్గలేదు. ఒంటరిగా నిలబడి ప్రధాన పార్టీలతో కలబడ్డారు. అది ఆయనకు మేలు చేసింది. అప్పటికే తమిళ నాట ఉన్న నాయకులకు విజయ్‌ను స్వచ్ఛమైన, ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రజలు చూశారు. అందుకే, 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఆయన పార్టీ 108 స్థానాలు కట్టబెట్టారు.

Also Read: Sangeetha Sornalingam - ఎవరీ సంగీత సోర్నలింగం? దళపతి విజయ్‌ను ఎలా కలిశారు? ప్రేమ - పెళ్లి కహానీ తెలుసుకోండి

అభిమానులు... ముందు నుంచి సామాజిక సేవ
తమిళనాడులో ఎంజీఆర్ రికార్డులను విజయ్ బద్దలు కొట్టారు. ఎంజీఆర్ సాధించిన ఓట్ల శాతం కంటే విజయ్‌కు వచ్చిన ఓట్ల శాతం ఎక్కువ. జయలలిత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యమంత్రిగా చేశారు. అయితే... ఆమె ఎంజీఆర్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ తర్వాత లోక నాయకుడు కమల్ హాసన్ వచ్చినప్పటికీ... ఎలాంటి ప్రభావం చూపించలేదు. రజనీకాంత్ అయితే రాజకీయాల్లో రాలేదు. రజనీకాంత్ అదిగో వస్తున్నారు, ఇదిగో వస్తున్నారు అని దశాబ్దానికి పైగా వినిపించినా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయనే స్వయంగా ప్రకటించారు. వాళ్ళకు సాధ్యం కానిది విజయ్ ఎలా సాధ్యం చేసి చూపించారు? ఆయనకు ఈ విజయాలు ఎలా సాధ్యం అయ్యింది? అంటే... అభిమాన గణం & సామాజిక సేవ.

విజయ్ హఠాత్తుగా రాజకీయాల్లోకి రాలేదు. కొన్నేళ్ల నుంచి ఆయన అభిమాన గణాన్ని సిద్ధం చేస్తూ వచ్చారు. సామాజిక సేవలో నిమగ్నం చేశారు. ముందు నుంచి సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. దాంతో పార్టీ స్థాపించిన తర్వాత క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఏర్పడింది. ఎన్నికల్లో సోషల్ మీడియా నుంచి ముఖాముఖీ ప్రచారం వరకు ఆ అభిమాన గణం బలంగా పని చేసింది. సో... అన్నిటి కంటే ముఖ్యంగా విజయ్ విజయంలో అభిమానుల పాత్రను విస్మరించలేం.

Also Read: Vijay Sangeetha Divorce: నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?

Author : Satya Pulagam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam