Dailyhunt
TVK Vijay Politics: గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్స్ కోరనున్న టీవీకే

TVK Vijay Politics: గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్స్ కోరనున్న టీవీకే

ABP దేశం 1 week ago

TVK Vijay Politics | చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విజయ్ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో 108 సీట్లతో తమిళగ వెట్రి కళగం (TVK) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.

మరోవైపు అధికార పార్టీ అయిన డీఎంకే (DMK)కు దారుణ పరాభవం తప్పలేదు. డీఎంకే కూటమి 73 స్థానాలు, అన్నాడీఎంకే కూటమి 53 స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ అధినేత గవర్నర్కు లేఖ రాశారు. తాము అధికారాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని లేఖలో కోరినట్లు సమాచారం. మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.

గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ లేఖ
తమిళనాడు గవర్నర్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని తెలుస్తోంది. ఈరోజు రాత్రి గవర్నర్ చెన్నైకి తిరిగి రానున్నారు. మరోవైపు తమిళనాడులో ఏ పార్టీ, కూటమి గానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధించలేదు. ఈ పరిస్థితుల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన టీవీకే అధినేత విజయ్ గవర్నర్ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని, 2 వారాల్లో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి మెజారిటీని నిరూపించుకుంటామని లేఖలో విజయ్ పేర్కొన్నారు.

టీవీకేకు దక్కని మెజారిటీ
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 స్థానాలు ఏ పార్టీకిగానీ, కూటమికిగానీ లేవు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎవరికి సీట్లు రాలేదు. అన్నాడీఎంకే కూటమిలో 4 స్థానాల్లో విజయం సాధించిన పీఎంకే (PMK) మద్దతుతో పాటు ఐయూఎంఎల్ (2), విసికె (2), సిపిఐ (2), సిపిఎం (2) సపోర్టుతో అధికారంలోకి రావాలని విజయ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే విడుదల చిరుతైగల్, కమ్యూనిస్ట్ పార్టీలు డీఎంకే కూటమిలో ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో టీవీకే ప్రభంజనంతో డీఎంకే మంత్రులు 16 మంది ఓడిపోయారు. మొత్తం 234 నియోజకవర్గాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అత్యధిక స్థానాలు సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తమిళనాడు గవర్నర్కు విజయ్ లేఖ రాశారు.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో గెలిచింది. విజయ్ రెండు చోట్ల గెలవడంతో, ఒక స్థానానికి రాజీనామా చేస్తే పార్టీ బలం 107కు చేరుతుంది. అధికార డీఎంకే కూటమి 73 స్థానాలకే పరిమితం కాగా, అందులో కాంగ్రెస్ 5 సీట్లు గెలిచింది. అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది; ఇందులో పీఎంకేకు 4 సీట్లు దక్కాయి.

ముస్లిం లీగ్, సిపిఐ, విసికె, సిపిఎం పార్టీలు రెండేసి స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీ, డిఎండికె, ఏఎంఎంకే పార్టీలు ఒక్కో సీటును దక్కించుకున్నాయి. ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 స్థానాల స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది. ఇప్పుడు చిన్న పార్టీల మద్దతు ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam