Strait of Hormuz | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను మరోసారి హెచ్చరించారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ..
ఒకవేళ ఇరాన్ ఏదైనా తప్పుడు అడుగు వేస్తే, అమెరికా మళ్లీ సైనిక చర్యకు దిగుతుందని స్పష్టం చేశారు. అయితే, ఇదే సమయంలో ప్రస్తుతం ఆగిన ఉద్రిక్తతను పూర్తి స్థాయిలో ముగించే ఉద్దేశంతో ఇరాన్ పంపిన సరికొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఇరాన్కు చెందిన తస్నీమ్, ఫార్స్ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ద్వారా 14 అంశాలతో కూడిన ఒక ప్రతిపాదనను అమెరికాకు చేరవేసింది. ఈ ప్రతిపాదనలో అన్ని రంగాల్లోనూ యుద్ధాన్ని ముగించాలనే అంశాన్ని ఇరాన్ ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి కోసం ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సూచించింది.
ఇరాన్పై సైనిక చర్య గురించి ట్రంప్ ఏమన్నారు?
ఫ్లోరిడా నుండి మయామికి బయలుదేరే ముందు డొనాల్డ్ ట్రంప్ను మీడియా సంప్రదించింది. ఇరాన్ తాజా ప్రతిపాదనల గురించి ప్రశ్నించగా.. ఈ డీల్కు సంబంధించిన సమాచారం తనకు అందినట్లు తెలిపారు. త్వరలోనే ఇరాన్ ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే ఇరాన్ తాజా3 ప్రతిపాదనలు ఆమోదయోగ్యం అవుతాయని తాను అనుకోవడం లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఇరాన్ ఇప్పటివరకూ చేసిన తప్పిదాలకు చెల్లించాల్సినంత మూల్యాన్ని చెల్లించలేదని ట్రంప్ అన్నారు. మళ్లీ సైనిక చర్య జరిగే అవకాశం ఉందా? అని ట్రంప్ను ప్రశ్నించినప్పుడు, ఆయన నేరుగా సమాధానం చెప్పకుంటానే.. పరిస్థితులు డిమాండ్ చేస్తే అలాగే జరుగుతుందన్నారు. ఇరాన్ ఏదైనా తప్పుడు చర్యకు పాల్పడితే పరిస్థితులు ఒక్కసారి మారవచ్చని అన్నారు.
ఈ ప్రతిపాదనలో హర్మూజ్ను మళ్లీ తెరవడం, అమెరికా నేవీ విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేయడంతో పాటు ఇరాన్-లెబనాన్కు సంబంధించిన ఘర్షణలను ముగించడానికి నెల సమయాన్ని నిర్దేశించడం వంటి అంశాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని తర్వాతే ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పరిస్థితులు మళ్లీ క్షీణించవచ్చు - ఇరాన్
అమెరికా హద్దు మీరితే పరిస్థితులు మళ్లీ క్షీణించే అవకాశం ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాను నమ్మడం కష్టమని, ఇరు దేశాల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తవచ్చని ఇరాన్ సైనిక ఉన్నతాధికారి మహమ్మద్ జాఫర్ అసదీ పేర్కొన్నారు. ఇరాన్ మంత్రి కాజమ్ గరీబాబాది మాట్లాడుతూ.. చర్చల విధానాన్ని ఎంచుకోవాలా లేదా యుద్ధాన్ని కొనసాగించాలా అనేది ఇప్పుడు అమెరికానే తేల్చుకోవాల్సి ఉందన్నారు. ఇరాన్ ఈ రెండు పరిస్థితులకు సిద్ధంగా ఉందని, కానీ తమపై పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తూ చూస్తూ కూర్చునేది లేదన్నారు.
Author : Shankar Dukanam

