Dailyhunt
US-Iran War: ఈ రాత్రి కాళరాత్రే! ఇరాన్‌కు డొనాల్ట్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక! ఒక నాగరికత అంతం కాబోతోందని వార్నింగ్!

US-Iran War: ఈ రాత్రి కాళరాత్రే! ఇరాన్‌కు డొనాల్ట్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక! ఒక నాగరికత అంతం కాబోతోందని వార్నింగ్!

ABP దేశం 1 week ago

US-Iran War: అమెరికా ఇరాన్ మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి.

ఇరాన్ ప్రభుత్వం తన మొండి వైఖరి వీడకపోతే, ఆ దేశం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల వేళ అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్ ఖాతాలో తీవ్ర పదజాలంతో ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ రాత్రికి ఒక మొత్తం నాగరికత అంతరించిపోతుంది, అది మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అది జరుగుతుంది"అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌లో 47 ఏళ్లుగా కొనసాగుతున్న అవినీతి,దోపిడీ, మరణాల యుగం ముగియబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘట్టం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటిగా నిలిచిపోతుందని ట్రంప్ అభివర్ణించారు.

ఈ హెచ్చరికకు సంబంధించి ట్రంప్ ఒక స్పష్టమైన గడువును విధించారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలలోపు అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలలోపు ఇరాన్ తన షరతులకు లొంగిపోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని ఇరాన్ అడ్డుకోవడమే ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇరాన్ వెంటనే ఈ జలసంధిని తెరవాలని, లేదంటే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలను బాంబులతో నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌ను తిరిగి రాతి యుగంలోకి నెట్టేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యాలు యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో సూచిస్తోంది.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. టర్కీలోని ఇరాన్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, ట్రంప్‌ను ఒక సైకోపాత్‌గా అభివర్ణించింది. " అలెగ్జాండర్ దీనిని దహనం చేశాడు. మంగోలులు నాశనం చేశారు. చరిత్ర దీనిని పరీక్షించింది. కానీ ఇరాన్ ఇంకా ఇక్కడే ఉంది. ఒక సైకోపాత్ హెచ్చరికలు కాలం సాధించలేని దానిని అంతం చేయలేవు." అని ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది. తమ ప్రాచీన నాగరికత జోలికి వస్తే ఆమెరికా, దాని మిత్రదేశాలు ఎప్పటికీ మరిచిపోలేని దెబ్బ తింటాయని ఇరాన్ హెచ్చరించింది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. పౌరులకు చెందిన సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని ఆయన గుర్తు చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్‌లో తాము అనుకున్న యుద్ధ లక్ష్యాలను అమెరికా ఇప్పటికే సాధించిందని, ఇప్పుడు తదుపరి అడుగు వేయాల్సింది ఇరాననేనని పేర్కొన్నారు.

మధ్యవర్తులు 45 రోజుల పాటు కాల్పులు విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఇరాన్ కేవలం కాల్పుల విరమణ మాత్రమే కాకుండా యుద్ధం పూర్తిగా ముగియాలని పట్టుబడుతోంది.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam