Vaibhav Fight With Sri Lanka A Players: భారత క్రికెట్ సరికొత్త సంచలనం, 15 ఏళ్ల వండర్కిడ్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మైదానంలో సహనం కోల్పోయాడు.
శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత లంక ఆటగాళ్లపైకి దూసుకెళ్లాడు. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట జరిగి, అది కాస్తా శృతిమించేలా కనిపించడంతో సీనియర్ ప్లేయర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు ఈ గొడవకు దారితీసిన పరిస్థితులు ఏంటో క్లియర్ వీడియో ఆధారాలతో వెలుగులోకి వచ్చాయి.
అసలేం జరిగిందంటే..
దంబుల్లా వేదికగా ఇండియా-ఎ INDIA-A, శ్రీలంక-ఎ SRILANKA-A జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి టై గా ముగిసింది. ఫలితం కోసం అంపైర్లు 'సూపర్ ఓవర్' నిర్వహించారు. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక-ఎ జట్టు 16 పరుగులు చేసి, భారత్ ముందు 17 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
చేజింగ్లో ఇండియా-ఎ జట్టు కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్ ఆఖరి మూడు బంతులను వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్నాడు. లంక ఫాస్ట్ బౌలర్ కాగుతాస్ మథులన్ వేసిన ఈ మూడు బంతుల్లో వైభవ్ ఒక ఫోర్తో సహా కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో భారత్ వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
గొడవకు దారితీసిన పరిస్థితి ఇదే..!
ఇండియాను ఓడించిన ఆనందంలో శ్రీలంక ఆటగాళ్లు మైదానంలో కాస్త ఓవర్గానే సంబరాలు చేసుకున్నారు. ఓటమి భారంతో వైభవ్ సూర్యవంశీ, అతని పార్ట్నర్ సూర్యాంశ్ హెడ్గే నిరాశగా పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆ సమయంలో శ్రీలంక గుంపులోనుంచి ఓ ప్లేయర్ బయటకు వచ్చి.. వెనక్కి తిరిగి వెళ్తున్న సూర్యాంశ్ హెడ్గే, వైభవ్ సూర్యవంశీలను ఉద్దేశించి ఏదో కామెంట్ చేశాడు.సూపర్ ఓవర్లో కట్టడి చేయడం.. మ్యాచ్ కూడా పోవడంతో అసలే చిరాగ్గా ఉన్న తనను ఆ ఆటగాడు ఎగతాళి చేయడంతో వైభవ్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ లంక ప్లేయర్ వైపు దూసుకెళ్లాడు. లంక బౌలర్ మథులన్ వైపు ఆగ్రహంతో వెళ్తుండగా, మరో ప్లేయర్ విషేన్ హలంబగే మధ్యలోకి వచ్చాడు. ఆ సమయంలో కోపాన్ని ఆపుకోలేకపోయిన వైభవ్.. లంక ఫీల్డర్ను గట్టిగా నెట్టేశాడు. ఆ ఫీల్డర్ కూడా వైభవ్పైకి దూసుకురావడానికి ప్రయత్నించాడు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన శ్రీలంక సీనియర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా వెంటనే లంక ఆటగాళ్లను వెనక్కి లాగి, వైభవ్ను వారించి గొడవ సర్దుమణిగేలా చేశాడు.
అంతకుముందే మొదలైన టెన్షన్..
నిజానికి ఈ మ్యాచ్లో మొదట సూపర్ ఓవర్ ఆడేందుకు నిబంధనలు లేవని భావించారు. మ్యాచ్ టై అవ్వగానే వెలుతురు లేమి కారణంగా ఇండియా-ఎ కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో దాదాపు 10 నిమిషాల పాటు సుదీర్ఘ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలోనే వైభవ్ సూర్యవంశీ కూడా అంపైర్లతో మాట్లాడటానికి వెళ్లగా, హెడ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ అతడిని వెనక్కి లాగారు. చివరకు అంపైర్లు ఒప్పుకోవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు, అందులో భారత్ ఓడిపోయింది. ఆ నిరాశలో ఉన్న వైభవ్ను లంక ప్లేయర్ రెచ్చగొట్టడంతో ఈ అవుట్బర్స్ట్
సీనియర్ టీమ్కు ఎంపికైన వేళ..
మరో రెండు వారాల్లో ఐర్లాండ్ టీ20 టూర్ కోసం భారత సీనియర్ మెన్ క్రికెట్ జట్టుతో వైభవ్ సూర్యవంశీ కలవనున్నాడు. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా (15 ఏళ్లు) వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంతటి అద్భుతమైన కెరీర్ ముందున్న వైభవ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మ్యాచ్ రిఫరీ హెచ్చరికతో వదిలేస్తారా.. చర్యలు తీసుకుంటారో చూడాలి.
Author : ARYA

