Vaibhav Vs Bumrah: రాజస్థాన్ రాయల్స్ నిరుడు గ్రౌండ్‌లోకి వదిలిన బాణం.. వైభవ్ సూర్యవంశీ...ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగు ఆట గురించే ఇప్పుడు అంతా డిస్కషన్.
గ్రౌండ్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ.. పిచ్ మీద పడిన బాల్‌ను ఎలా బౌండరీ లైన్ బయటకు పంపిచాలని తప్ప మరో ధ్యాస లేదన్నట్లుగా ఉండే అతని ఆటకు అంతా ఫిదా అయిపోతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తన మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి టాప్‌లిస్టులోకి చేరిపోయింది. ముంబైతో మ్యాచ్‌లో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ముంబై బౌలర్లను ఆడేసుకోవడంతో 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఇప్పుడు జనం మాట్లాడుకుంటోంది... రాజస్థాన్ గెలుపు గురించి కాదు.. అద్భుతంగా అదరగొట్టిన యశస్వీ జైస్వాల్ గురించి కూడా కాదు. జస్ప్రీత్ బుమ్రాను బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఆడేసుకున్న తీరు గురించి..!
బుమ్రాను భయపెట్టిన బుడ్డోడు..
జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు చెబితే మహా మహా బ్యాట్ర్స్‌మెన్‌లే వణికిపోతారు. అలాంటి బుమ్రాను ఏ మాత్రం తొణక్కుండా ఏకిపారేశాడు వైభవ్. నువ్వు బుమ్రా అయితే ఏంటి.. ఎవరైతే ఏంటన్నట్లుగా మొదటి బాల్‌నే స్టాండ్స్‌లోకి పంపించేశాడు. బుమ్రాకు సిక్స్‌తో వైభవ్ ఇచ్చిన వెల్కమ్‌కు స్డేడియం హోరెత్తింది. అదే ఊపులో ఆ ఓవర్‌లో బుమ్రాను మరో సిక్స్ కూడా ఉతికేశాడు ఎలాంటి బౌలర్‌నైనా ఏమాత్రం భయం లేకుండా ఈ చిన్న కుర్రాడు ఆడేసుకుంటున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా బుమ్రా బౌలింగ్‌ను చెండాడమే ఉదాహరణ. శార్దూల్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో చిక్కాడు కానీ.. మళ్లీ బుమ్రా బౌలింగ్‌కు వస్తే ఏమయ్యేదో.. ఏమైతేనేం.. అప్పటికే 39 పరుగులు చేసిన వైభవ్ టాప్ రన్నర్ చేజ్‌లో నిలిచాడు
పరుగుల వేటలో వైభవ్
IPL ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు రెండూ ఇప్పుడు రాజస్థాన్ దగ్గరే ఉన్నాయి. 170 అత్యధిక పరుగులతో RR ఓపెనర్ జైస్వాల్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. పట్టుని 10మ్యాచ్‌ల అనుభవం కూడా లేని వైభవ్ ఈ సారి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటున్నాడు. ఇప్పుడు కూడా 122 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంకో మ్యాచ్‌లో క్లిక్ అయితే టాప్‌లోకి రావడం ఖాయం.

వైభవ్ ఆటతీరుతో RRకు క్రేజ్...
IPL 18 సీజన్లు చూసుకుంటే 10 వరకూ జట్లు ఉన్నా.. కేవలం కొన్ని జట్లకే క్రేజ్ ఉంటుంది. ఆ టీమ్‌లో ఉండే స్టార్ ఆటగాళ్లు, వాళ్ల ఆటతీరు, ఫ్యాన్‌బేస్ ప్రకారం నాలుగు జట్లు ఎప్పుడూ పాపులర్ అవుతాయి. ధోనీ ఉన్న CSK, కోహ్లీ ఉండే RCB, ఊచకోత ఆటగాళ్లు ఉండే SRH, ఎక్కువ సార్లు కప్పు గెలిచిన MI కి ఫ్యాన్స్ ఎక్కువ. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విన్నింగ్ పర్సంటేజ్ బాగానే ఉన్నప్పటికీ.. పాపులారిటీ మాత్రం తక్కువే. అయితే ఇప్పుడు వైభవ్ వచ్చాక.. RR మ్యాచ్‌లు చూడటానికి ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారు.
Author : ARY

