హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు'తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించడం ఎంతో సంతోషాన్ని, మనశ్శాంతిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సక్సెస్ జోష్లో ఉన్న వరుణ్ తేజ్, గాయం నుంచి కోలుకున్నాక చెల్లెలు నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మాణంలో 'బరి' చిత్రీకరణ మొదలు పెడతారు. ఇంతకు ముందు ఆయన చేసిన స్పోర్ట్స్ డ్రామా 'గని' సరిగా ఆడలేదు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'బరి'పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
తన కెరీర్ ప్రారంభం నుంచి టైప్ కాస్ట్ కాకుండా (సేమ్ రోల్స్ చేయకుండా) కథలు - సినిమాల పరంగా డిఫరెన్స్ చూపించడానికి ప్రయత్నించానని వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కొన్ని సీరియస్ సినిమాలు చేశానని, ప్రేక్షకులు తన నుంచి వినోదం కూడా కోరుకుంటున్నారని 'కొరియన్ కనకరాజు' చేశానని, ఆ మూవీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు వరుణ్ తేజ్.
'కొరియన్ కనకరాజు' సక్సెస్ కావడంతో నెక్స్ట్ సినిమా స్కిప్ట్ సెలక్షన్ అంత ఈజీ ఏం కాదన్నారు వరుణ్ తేజ్. తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో, జాతీయ అవార్డు అందుకున్న 'కమిటీ కుర్రోళ్లు' దర్శకుడు యదు వంశీతో స్పోర్ట్స్ డ్రామా 'బరి' చేస్తున్నానని చెప్పారు. అందులో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్గా కనిపించనున్నారు.
స్పోర్ట్స్ డ్రామా 'గని' బాక్సాఫీస్ బరిలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, అందువల్ల 'మరోసారి స్పోర్ట్స్ డ్రామా చేసి ఎందుకు చేతులు కాల్చుకుంటున్నావ్?' అని చాలా మంది తనను ప్రశ్నించారని వరుణ్ తేజ్ చెప్పారు. 'గని' ఎందుకు ఆడలేదో తనకు తెలుసు అని, ఆ సినిమాలో అన్ని రకాల అంశాలు ఉండాలని ప్రయత్నించి తప్పు చేశామని, కానీ ఈసారి 'బరి'లో కేవలం తాము అనుకున్న కథపై దృష్టి పెట్టామని, ఈసారి తప్పకుండా విజయం అందుకుంటారని, 'గని'లో జరిగిన తప్పు 'బరి'లో జరగదని వరుణ్ తేజ్ ధీమా వ్యక్తం చేశారు.
మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే...
నిహారికతో కలిసి పనిచేయడం గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ''మా ఇద్దరి ఆలోచనా విధానాలు, అభిరుచులు ఒకేలా ఉంటాయి. మేం ఎక్కువగా సినిమాల గురించి చర్చించుకుంటాం. నిహారిక 'బరి' లైన్ చెప్పగానే నచ్చింది. వెంటనే మేం ఈ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాం. ముందుగా మేం కలిసి ఈ సినిమా చేయాలని అనుకోలేదు. నాకు కథ నచ్చడంతో చేస్తానని చెప్పాను'' అని చెప్పారు.
'బరి' కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో వరుణ్ తేజ్ గాయపడ్డారు. దాంతో ఆయనకు మోకాలికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్న వరుణ్ తేజ్, త్వరలో 'బరి' షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు.
Author : S Niharika

