మార్కాపురం జిల్లా పరిధిలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన వేళ ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీశైలం జలాశయ నిల్వల నుంచి కొల్లం వాగు ద్వారా వెలిగొండ సొరంగ మార్గాల్లోకి కృష్ణా జలాలను అధికారులు విడుదల చేశారు.
నీటి విడుదలకు ముందు భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు సైరన్ మోగించి మొదటి హెచ్చరికను జారీ చేశారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడంతో, నిర్ణయించిన ప్రకారం రేపు (ఆగస్టు 31న) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం క్రాస్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి నల్లమల సాగర్ జలాశయానికి కృష్ణా జలాలను అధికారికంగా విడుదల చేసి, ఈ బహుళార్థసాధక ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.
మార్కాపురం చరిత్రలో ఆగస్టు 31 సువర్ణాధ్యాయం
మార్కాపురం జిల్లా కరవు నేల చరిత్రలో ఆగస్టు 31వ తేదీ సువర్ణాధ్యాయంగా నిలవబోతోంది. దశాబ్దాల తరబడి ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను ప్రారంభించి, కృష్ణా జలాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నల్లమల సాగర్‌కు 10.7 టీఎంసీల నీటిని తరలించనున్నారు. 3 దశాబ్దాల క్రితం చంద్రబాబు చేతుల మీదుగానే శంకుస్థాపన జరుపుకున్న ఈ డ్రీమ్ ప్రాజెక్టును మళ్లీ ఆయన చేతుల మీదుగానే ప్రారంభించి జాతికి అంకితం చేస్తుండటంతో ప్రకాశం, మార్కాపురం జిల్లాల గ్రామాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ప్రకాశం, మార్కాపురం జిల్లాలకి సరికొత్త భరోసా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం తరహాలోనే వెలిగొండపై ప్రత్యేక దృష్టి సారించి రూ.2,400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి మొదటి దశ పనులను వేగంగా పూర్తి చేసింది. ఒకానొక దశలో కలగానే మిగిలిపోతుందనుకున్న ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతాంగానికి సరికొత్త భరోసా లభించింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల వేల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, తీవ్రమైన ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి శాశ్వత విముక్తి లభించనుంది. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా పరిశుభ్రమైన తాగునీరు అందించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటిదశను అధికారికంగా ప్రారంభించబోతున్నారు.
పరిహారం అందజేసిన కూటమి ప్రభుత్వం
మరోవైపు ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. కేవలం 3 విడతల్లోనే 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారాన్ని నేరుగా అందించడంతో పాటు, అదనంగా మరో రూ.169 కోట్లు ప్రకటించారు. 2019 తర్వాత 18 సంవత్సరాలు నిండిన నిర్వాసిత యువతకు రూ.2 లక్షల చొప్పున సహాయాన్ని అందిస్తున్నారు. నిర్వాసిత మహిళలను గౌరవిస్తూ చీర, పసుపు, కుంకుమ, గాజులతో కూడిన ప్రత్యేక కిట్లను, 10 వేల కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో కూడిన ఉచిత నిత్యావసర సరుకుల కిట్లను, 4,933 పశువులకు 30 రోజుల పాటు ఉచిత దాణాను పంపిణీ చేస్తున్నారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో సోమవారం నాడు కృష్ణా జలాల విడుదలతో ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
Author : Shankar Dukanam

