Tamil Nadu political realignment 2026: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ఎవరూ ఊహించని విధంగా నటుడు, టీవీకే అధినేత విజయ్..
ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కోటను బద్దలు కొట్టే పనిలో పడ్డారు. మిత్రపక్షాలపై ఆధారపడటం వల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను ముందే పసిగట్టిన విజయ్, తన పార్టీకి సొంతంగా మెజార్టీ సాధించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే అన్నాడీఎంకేకు చెందిన నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నమ్మకం లేని పొత్తులు - నలుగురు ఎమ్మెల్యేల వ్యూహం
విజయ్ ప్రస్తుతం కొన్ని మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ వారిని పూర్తిస్థాయిలో నమ్మడం లేదు. అందుకే, క్షేత్రస్థాయిలో బలం ఉన్న అన్నాడీఎంకే నేతలను తనవైపు తిప్పుకుంటున్నారు. తాజాగా రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలో చేరడం వెనుక.. భవిష్యత్తులో అన్నాడీఎంకే ఓటు బ్యాంకును పూర్తిగా టీవీకే వైపు మళ్లించాలన్నది ఆయన మాస్టర్ ప్లాన్. అయితే విజయ్ చేస్తున్న ఈ సోలో రాజకీయం ప్రస్తుతం ఆయనతో ఉన్న మిత్రపక్షాలకు రుచించడం లేదు. తమకు చెక్ పెట్టడానికే విజయ్ ఈ తరహా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారా అన్న అనుమానం వారిలో మొదలైంది. ఒకవేళ విజయ్ బలం పెరిగితే తమను పక్కన పెడతారని వారు భావిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆ పార్టీలుపాత మిత్రుడైన డీఎంకే వైపు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
డీఎంకే వైపు చూపు.. పాత బంధాల పునరుద్ధరణ?
విజయ్ దూకుడుకు బ్రేక్ వేయాలని భావిస్తే, చిన్న పార్టీలన్నీ ఏకమై డీఎంకే కూటమి వైపు వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. విజయ్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తన సొంత మెజార్టీ పెంచుకునేలోగానే ఆయనను ఏకాకిని చేయాలని మిత్రపక్షాలు ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదన్నవాదన వినిపిస్తోంది. విజయ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అన్నాడీఎంకే టీవీకేను దెబ్బతీయడమే లక్ష్యంగా కొత్త సమీకరణాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ప్రమాదాన్ని విజయ్ ఊహిస్తున్నారు. ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
విజయ్ సన్నిహిత వర్గాలు కనీసం పది మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. చిన్న పార్టీల అండతో ప్రభుత్వాన్ని నడపడం వల్ల వారి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తలొగ్గాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను, ముఖ్యంగా నియోజకవర్గాల్లో పట్టున్న ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. ఈ ఆపరేషన్ అన్నాడీఎంకే విజయవంతమైతే విజయ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. తన సొంత మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్న విజయ్ మిత్రపక్షాల అసంతృప్తిని విజయ్ ఎలా డీల్ చేస్తారు? అన్నాడీఎంకే నుంచి మరిన్ని వికెట్లు పడతాయా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. విజయ్ వేస్తున్న ఈ స్కెచ్ ఆయన సీఎం పీఠాన్ని బలోపేతం చేస్తుందా.. లేక మిత్రపక్షాలను దూరం చేసి ఇబ్బందుల్లో నెడుతుందా అన్నది చూడాలి.
Author : Raja Sekhar Allu

