Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన

ABP దేశం 3 days ago

హైదరాబాద్: నేటి రోజుల్లో మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో, చనిపోయాక చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నారు. చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?

అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రశ్నించారు. ఆయన షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను సైతం కదిలిస్తోంది.

హరియాణాలోని సోనిపట్కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ ఓ వృద్ధాశ్రమంలో కన్నుమూసిన ఘటనపై ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించి, పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఆ తండ్రి చివరికి అనాథలా వైకుంఠ ధామానికి చేరడం నేటి సమాజంలో దిగజారుతున్న మానవ సంబంధాలకు, నైతిక విలువలకు సజీవ సాక్ష్యమన్నారు.

కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపునకు కూడా రాలేకపోయిన కుమార్తెలు, ఆఖరికి అంత్యక్రియలను మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా చూస్తూ సరిపెట్టుకోవడం అత్యంత దారుణం అన్నారు. తండ్రి చివరి కార్యక్రమాల ఖర్చుల కోసం కేవలం ₹5,100 ఆన్లైన్లో పంపి తమ బాధ్యత తీరిపోయిందని భావించడం, నేటి సమాజంలో మనుషులు యంత్రాల్లా ఎలా మారిపోతున్నారో తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకని సజ్జనార్ ప్రశ్నించారు. కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివని నిలదీశారు. చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాలేవని స్పష్టం చేశారు.

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జీఎస్పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!

తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మమని హైదరాబాద్ సీపీ పిలుపునిచ్చారు. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం మానవత్వానికే మచ్చ అని, ఇలాంటి స్వార్థపూరిత సంస్కృతిలో త్వరితగతిన మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam