PM Narendra Modi AP Visit Dhimsa Welcome: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర విశిష్ట గిరిజన సాంప్రదాయ నృత్యమైన థింసా ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డులను తిరగరాసింది.
రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ శైలిలో ఘన స్వాగతం పలికేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా ఒకే వేదికపై ఏకంగా 13 వేల మంది గిరిజన కళాకారులు ఏకకాలంలో థింసా నృత్యాన్ని ప్రదర్శించి విశ్వవేదికపై చరిత్ర సృష్టించారు. వేలాది మంది కళాకారులు ఒకే లయలో అడుగులు వేస్తూ ప్రదర్శించిన ఈ నృత్య రూపకం రికార్డుల రారాజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా చోటు దక్కించుకుంది.
11 వేల మంది గిరిజన కళాకారులతో గత రికార్డ్
గతంలో 11 వేల మంది గిరిజన కళాకారులతో ప్రదర్శించిన థింసా నృత్యమే అతిపెద్ద రికార్డుగా ఉండగా, ఆ పాత రికార్డును తిరగరాస్తూ ఏపీ ప్రభుత్వం ఈ బృహత్తర ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం విచ్చేసే మార్గంలో ఆయనకు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికేందుకు పాడేరు, సీతాంపేట, పార్వతీపురం , రంపచోడవరం వంటి ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చిన వేలాది మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. 400కు పైగా బృందాలుగా ఏర్పడి, లయబద్ధమైన కాళ్ల ఘల్లులతో పక్కా సమన్వయంతో చేసిన ఈ ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
ఈ చారిత్రాత్మక రికార్డు నమోదు ప్రక్రియ అత్యంత నిబంధనల నడుమ సాగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ప్రతినిధులు నేరుగా హాజరై ప్రదర్శన రిహార్సల్స్ , తుది ప్రదర్శనను పూర్తిస్థాయిలో పరిశీలించారు. వేలాది మంది కళాకారులు ఒకే వేదికపై ఒకేసారి ఎలాంటి తప్పులు లేకుండా గిరిజన వాయిద్యాల శబ్దాలకు అనుగుణంగా అడుగులు వేయడం, లయ తప్పకుండా ప్రదర్శన పూర్తి చేయడాన్ని ప్రతినిధుల బృందం సాంకేతికంగా పరిశీలించి ధృవీకరించింది. అనంతరం ఈ ప్రదర్శన సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదైనట్లు ప్రకటించారు.
ఈ మైలురాయిని సాధించడంపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలో గిన్నిస్ బుక్ ప్రతినిధులు అధికారిక రికార్డు పత్రాన్ని అందజేశారు. గిరిజన సంస్కృతికి, వారి కళారూపాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం తమ ప్రభుత్వానికి దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ సంస్కృతిని కాపాడుకుంటూనే, గిరిజన కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ విజయం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమానికి , సాంస్కృతిక రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ గిన్నిస్ రికార్డే నిదర్శనమని రాజకీయ, సామాజిక వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటన వేళ ఒకేసారి 13 వేల మంది గిరిజన కళాకారులు విశ్వవిజయం సాధించడం అటు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపింది.
Author : Raja Sekhar Allu

