అమరావతి: ఏపీకి చెందిన మహిళ విదేశాలలో ఇబ్బందులు పడలేక సొంత ప్రాంతానికి తిరిగి వచ్చేందుకు సహాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఈ వీడియో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆమెను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కాపాడండి అన్నా అంటూ మహిళ వీడియో
కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ (ఒమన్) వెళ్లిన ఏపీలోని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన దూదేకుల షెహనాజ్ అనే మహిళ అక్కడ తీవ్ర వేధింపులకు గురవుతోంది. పని చేస్తున్న చోట యజమాని తనను బంధించి, కనీసం ఆహారం, నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వకుండా కొడుతున్నారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా కన్నీరుమున్నీరైంది. ‘నారా లోకేష్ అన్న నన్ను కాపాడండి.. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడన్నా... ఇక్కడ నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి2 అంటూ ఆమె పంపిన వీడియో సందేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కదిలించింది. ఈ వీడియో తమ దృష్టికి రాగానే అటు పవన్ కళ్యాణ్, ఇటు నారా లోకేష్ వెంటనే స్పందించారు.
షెహనాజ్ ఆవేదనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించారు. ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది రంగంలోకి దిగారు. ఒమన్లోని ఏజెంట్తో పాటు, భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, అక్కడి భారత దౌత్య కార్యాలయాన్ని (Indian Embassy) సంప్రదించి చర్చలు జరుపుతున్నారు. షెహనాజ్ సురక్షితంగా తిరిగి వచ్చేలా చేపడుతున్న ఈ మొత్తం ప్రక్రియను పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు.
క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం.. నారా లోకేష్ హామీ
మరోవైపు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ‘నా సోదరి ప్రస్తుతం మస్కట్లో చిక్కుకుపోయి పడుతున్న ఇబ్బందులు చూసి నా మనసు తల్లడిల్లుతోంది. ఆమెను క్షేమంగా ఏపీలోని తన ఇంటికి తీసుకురావడానికి మేము ఎంతటి ప్రయత్నానికైనా సిద్ధంగా ఉన్నామని’ పేర్కొన్నారు. షెహనాజ్ సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి రావడానికి సహాయం చేయాల్సిందిగా తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించామని, అత్యవసరంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు వేగంగా స్పందించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Author : Shankar Dukanam

