Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
YS Jagan Mavigan Capital Plan Analysis: పొలిటికల్ ఎజెండా షిఫ్ట్  - మూడు రాజధానుల నుండి  మావిగన్ కారిడార్‌కు జగన్ షిఫ్ట్.. ప్రజలు నమ్ముతారా?

YS Jagan Mavigan Capital Plan Analysis: పొలిటికల్ ఎజెండా షిఫ్ట్ - మూడు రాజధానుల నుండి మావిగన్ కారిడార్‌కు జగన్ షిఫ్ట్.. ప్రజలు నమ్ముతారా?

ABP దేశం 2 weeks ago

Amaravati vs Mavigan Election Agenda 2026 : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా ప్రకటన రాష్ట్రంలో ఒక కొత్త పొలిటికల్ డిబేట్ను లేవనెత్తింది.

వచ్చే ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోరు కాదని.. "మావిగన్ వర్సెస్ అమరావతి" నినాదాల మధ్యే పోరు అని ఆయన అజెండా సెట్ చేశారు. అయితే, ఐదేళ్లు మూడు రాజధానుల జపం చేసిన జగన్, ఇప్పుడు ఒక్కసారిగా మావిగన్ మచిలీపట్నం-MA, విజయవాడ-VI, గుంటూరు-GUN గ్రోత్ కారిడార్ అనే సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ఎన్నికల అజెండాగా మార్చడం వెనుక రాజకీయ చదరంగం ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

మాట మార్పుపై ప్రజల్లో అనుమానాలు

రాజధాని విషయంలో వైసీపీ అధినేత విధానాలు నిలకడలేకుండా ఉన్నాయనే విమర్శలు క్షేత్రస్థాయిలో, సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. 2014-19 మధ్య విపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికిన జగన్.. 2019లో అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి అమరావతి పనులను పూర్తిగా నిలిపివేశారు. ఆ నినాదంతోనే 2024 ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయం చవిచూశారు. ఇప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న తరుణంలో.. విశాఖ, కర్నూలు ఊసు ఎత్తకుండా కేవలం మావిగన్ కారిడార్ అనడం చూస్తుంటే, ఒకే అంశంపై ఇన్నిసార్లు మాట మార్చడాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారనే అనుమానాలు రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

అసలు ‘మావిగన్’ ప్లాన్ ఏంటి?

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ మావిగన్ నమూనాపై వైసీపీ ఇప్పటికైనా పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మచిలీపట్నం పోర్టును, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి ఒక 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్గా అభివృద్ధి చేస్తామని చెప్తున్న జగన్.. అసలు ఇక్కడ సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ వంటి పరిపాలనా విభాగాలు ఉంటాయా? లేదా అనేది క్లియర్ చేయలేదు. ఇది కేవలం పారిశ్రామిక అభివృద్ధి కేంద్రమా? లేక ఉద్యోగ, ఉపాధి సృష్టికి సంబంధించిన ప్లాన్ మాత్రమేనా? అన్నదానిపై క్లారిటీ లేదు. శూన్యం నుండి అమరావతిని కట్టడానికి లక్షల కోట్లు వృథా చేయడం కంటే, మౌలిక సదుపాయాలు ఉన్న ఈ మూడు నగరాలను కనెక్ట్ చేయడం ఆర్థికంగా బెటర్ అనేది జగన్ ఆలోచన అయినప్పటికీ.. దీని బ్లూప్రింట్ ఏంటన్నది ప్రజల ముందు ఉంచితేనే విశ్వసనీయత పెరుగుతుంది.

మళ్లీ గందరగోళంలోకి నెట్టే వ్యూహం..

ఈ మావిగన్ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం నెల్లూరు జిల్లా పర్యటనలో తీవ్రంగా స్పందించారు. గతంలో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్లు.. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారు.. అసలు మావిగన్ అంటే ఏంటో నాకే అర్థం కావడం లేదు" అంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. ఏపీ పునర్నిర్మాణానికి తాము ప్రయత్నిస్తుంటే, అమరావతిపై ఉన్న అక్కసుతోనే వైసీపీ మళ్లీ ప్రజల్లో ప్రాంతీయ, స్థానిక విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఒక చట్టబద్ధమైన రాజధానిపై ఇలాంటి గందరగోళ ప్రకటనలు పక్క రాష్ట్రాల ముందు ఏపీ పరువు తీసేలా ఉన్నాయనే విమర్శలూ వస్తున్నాయి.

ఓటర్లను నమ్మించాలంటే వైసీపీ చాలా కష్టపడాలి!

రాజకీయాల్లో విశ్వసనీయత అత్యంత కీలకం. ఒకే పార్టీ ఒకే రాజధాని అంశంపై ఒకసారి అమరావతి అనుకూలం అని, మరోసారి మూడు రాజధానులు అని, ఇప్పుడు కేవలం మావిగన్ కారిడార్ అని చెప్పడం వల్ల సామాన్య ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల అజెండా సక్సెస్ అవ్వాలంటే.. కేవలం అమరావతి అవినీతిని విమర్శించడం మాత్రమే సరిపోదు. అమరావతి కంటే ఈ మావిగన్ కారిడార్ ద్వారా పేదలకు, యువతకు ఎలాంటి మేలు జరుగుతుందో వివరించే ఒక పక్కా రోడ్మ్యాప్ను, ఉపాధి సృష్టి ప్రణాళికను వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి జనాల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేనిపక్షంలో, ఇది కూడా గత మూడు రాజధానుల తరహాలోనే ఒక పొలిటికల్ స్లోగన్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam