Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
YS Jagan PA KNR raids news 2026: లిక్కర్ స్కాం ఉచ్చులో జగన్ పీఏ కేఎన్ఆర్ - వందల కోట్ల ఆస్తులని ప్రచారం - అసలు  టార్గెట్ మాజీ సీఎం ?

YS Jagan PA KNR raids news 2026: లిక్కర్ స్కాం ఉచ్చులో జగన్ పీఏ కేఎన్ఆర్ - వందల కోట్ల ఆస్తులని ప్రచారం - అసలు టార్గెట్ మాజీ సీఎం ?

ABP దేశం 6 days ago

Jagan Mohan Reddy benami links SIT investigation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ స్టాఫ్ నుంచి నేరుగా ఆయన నివాసం వైపు మళ్లుతోంది.

జగన్ నీడగా భావించే ఆయన వ్యక్తిగత సహాయకుడు కే. నాగేశ్వరరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో జరిగిన సోదాలు, వెలుగులోకి వచ్చిన ఆర్థిక లావాదేవీలు రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పీఏ ముసుగులో భారీ సామ్రాజ్యం

ఒకప్పుడు కేవలం కొద్దిపాటి జీతానికి పని చేసిన కేఎన్ఆర్ వద్ద నేడు వందల కోట్ల ఆస్తులు ఉండటం దర్యాప్తు సంస్థలను ఆశ్చర్యపరిచింది. తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఖరీదైన భూములు, షాపింగ్ మాల్స్లో వాటాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు.. ఇవన్నీ ఒక పీఏ స్థాయి వ్యక్తి ఎలా సంపాదించారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. మద్యం వ్యాపారుల నుంచి సేకరించిన లంచాలు ఈ ఆస్తుల రూపంలోకి మారాయని సిట్ బలంగా అనుమానిస్తోంది. అయితే, దర్యాప్తు సంస్థల అసలు వ్యూహం కేఎన్ఆర్ ఆస్తులను జప్తు చేయడం మాత్రమే కాదు, ఆ సంపద వెనుక ఉన్న అసలు యజమానిని వెలికితీయడం.

జగన్కు తెలియకుండా సాధ్యమేనా?

ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న కేఎన్ఆర్, జగన్ మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఇంతటి భారీ ఎత్తున సెటిల్మెంట్లు చేయడం అసాధ్యం. జగన్ పక్కనే పదేళ్ల పాటు ఉంటూ, ఆయన ప్రతి అడుగును గమనించే వ్యక్తి ఇన్ని వేల కోట్ల దందా చేస్తున్నారంటే.. అది అధినేత కనుసన్నల్లోనే జరిగి ఉంటుందనే ప్రచారం సామాన్య ప్రజల్లోకి వెళ్తోంది. కేఎన్ఆర్ కేవలం ఒక ఫ్రంట్ మ్యాన్ మాత్రమేనని, అసలు లబ్ధిదారు జగనేనని నిరూపించే దిశగా సిట్ అడుగులు వేస్తోంది. మద్యం పాలసీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చి, తద్వారా వ్యక్తిగత ఆస్తుల రూపంలోకి మళ్లించడం ఈ కుంభకోణం సారాంశం. కేఎన్ఆర్ భార్య ఖాతాలో బయటపడిన సుమారు రూ. 20 కోట్ల నగదు , బినామీల పేరిట ఉన్న డాక్యుమెంట్లు జగన్కు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

ముంచుకొస్తున్న కేంద్ర సంస్థల ముప్పు

రాష్ట్ర దర్యాప్తు సంస్థ సేకరిస్తున్న ఈ వివరాలు త్వరలోనే ఈడీ , ఐటీ శాఖలకు చేరనున్నాయి. ఇప్పటికే మద్యం కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తున్న ఈడీ, కేఎన్ఆర్ను కస్టడీలోకి తీసుకుంటే జగన్ చిక్కులు రెట్టింపు కావడం ఖాయం. ఒక పీఏ నోరు విప్పితే, అది నేరుగా మాజీ ముఖ్యమంత్రి మెడకు చుట్టుకుంటుంది. కేఎన్ఆర్ సెటిల్మెంట్లన్నీ జగన్ కోసమే చేశారని గనుక రుజువైతే, అది జగన్ రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసే అంశమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ఓటమితో కుదేలైన వైసీపీకి, ఈ సోదాలు అశనిపాతంలా మారాయి. రాష్ట్ర దర్యాప్తు సంస్థల టార్గెట్ స్పష్టంగా ఉంది. కేఎన్ఆర్ను ఒక అస్త్రంగా వాడుకుని జగన్ చుట్టూ ఉన్న ఆర్థిక నేరాల వలయాన్ని ఛేదించడమే ప్రస్తుత వ్యూహం. రాబోయే రోజుల్లో కేఎన్ఆర్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా జగన్ నివాసంలో కూడా సోదాలు జరిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికి, తన నీడ చేసిన తప్పులు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులను మోసుకొస్తున్నాయని అనుకోవచ్చు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam