Dailyhunt
YSRCP:  వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని  దండయాత్ర ధోరణి!

YSRCP: వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!

ABP దేశం 1 week ago

Rasmi Vs Ysrcp: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అనుసరిస్తున్న దూకుడు వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో సెలబ్రిటీలను, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులు పార్టీకి రాజకీయంగా చేటు తెచ్చాయన్న విశ్లేషణలు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ఆ విభాగం తన పంథాను మార్చుకోలేదని అర్థమవుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

రష్మీ గౌతమ్పై విమర్శల పర్వం - పాత కథే పునరావృతం?

గత రెండు రోజులుగా ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న దాడులు నెటిజన్లలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. తిరుపతిలో జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో మూగజీవాల పట్ల జరిగిన హింసను ఆమె ప్రశ్నించడమే ఈ వివాదానికి కారణమైంది. అయితే, దీనిని ఒక సామాజిక అంశంగా చూడకుండా, ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ఆమె వృత్తిని కించపరుస్తూ పోస్టులు పెట్టడం వైసీపీ సోషల్ మీడియా మార్క్ ట్రోలింగ్ ను గుర్తుచేస్తోంది. ఈ ధోరణి పార్టీకి మేలు చేయడం కంటే, తటస్థ ఓటర్లను దూరం చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.

రజనీకాంత్ నుంచి రష్మీ వరకు.. ముగియని వివాదాలు

గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్, చంద్రబాబు నాయుడును ప్రశంసించారనే కారణంతో వైసీపీ శ్రేణులు ఆయనపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరూ చూశారు. ఆనాడు అది జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసి, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. ఇప్పుడు అదే బాటలో రష్మీ వంటి సినీ ప్రముఖులపై దాడులు చేయడం వల్ల పార్టీకి సహనం లేని సంస్థ అనే ముద్ర పడుతోంది. ఎవరైనా చిన్న విమర్శ చేసినా, లేదా తమకు నచ్చని అభిప్రాయం వ్యక్తం చేసినా వారిపై బూతుల దండయాత్ర చేయడం ఒక వ్యూహంగా మారడం మంచిది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోలేదా?

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి సోషల్ మీడియాలో అనుసరించిన అతివాద వైఖరి కూడా ఒక ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం వంటి చర్యల వల్ల సామాన్య ప్రజల్లో పార్టీ పట్ల విముఖత ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరిదిద్దుకుంటారని భావించిన క్యాడర్కు, తాజా రష్మీ గౌతమ్ ఉదంతం తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. సోషల్ మీడియా విభాగం తన పద్ధతిని మార్చుకోకపోతే, పార్టీ భవిష్యత్తులో మరింత మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

పెద్దల నియంత్రణ లోపించిందా?

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన పార్టీ అగ్రనాయకత్వం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దూషణలకు దిగే వారిని వారించకపోగా, కొన్నిసార్లు ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడం వల్ల అటు కార్యకర్తలు కూడా బరితెగిస్తున్నారన్న వాదన ఉంది. సోషల్ మీడియా అనేది పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వేదికగా ఉండాలి తప్ప, వ్యక్తిగత కక్ష సాధింపులకు వేదిక కాకూడదని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. వైసీపీ పెద్దలు తక్షణం జోక్యం చేసుకుని ఈ విభాగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని తర్కంతో, వాస్తవాలతో ఎదుర్కోవాలే తప్ప.. వ్యక్తిగత దాడులతో కాదనే స్పృహ కలిగించడంలో నాయకత్వం విఫలమవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, వైసీపీ సోషల్ మీడియాకు అంటుకున్న బూతుల పార్టీ అనే ముద్ర శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉందని క్యాకడర్ ఆందోళన చెందుతున్నారు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam