ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు క్లైమాక్స్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మినహా మిగిలిన ఎనిమిది జట్లు ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి.
ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (16 పాయింట్లు)
ఆర్సీబీ భవితవ్యం వారి చేతుల్లోనే ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే 20 పాయింట్లతో టాప్-2లో నిలుస్తారు. ఒకవేళ ఒక మ్యాచ్ ఓడిపోయినా, వారి మెరుగైన నెట్ రన్ రేట్ (+1.053) టాప్-2లో ఉండేందుకు సహాయపడుతుంది.
- గుజరాత్ టైటాన్స్ (16 పాయింట్లు)
వరుసగా ఐదు విజయాలతో జోరు మీదున్న గుజరాత్ కూడా మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే టాప్-2లో చేరుతుంది. ఒకవేళ రెండింటిలోనూ ఓడిపోతే మాత్రం సమీకరణాలు క్లిష్టంగా మారుతాయి.
- సన్‌రైజర్స్ హైదరాబాద్ (14 పాయింట్లు)
ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌లో చోటు ఖాయం చేసుకోవాలంటే తమ చివరి రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. ఒకవేళ ఆర్సీబీ లేదా గుజరాత్ తమ మ్యాచ్‌లలో తడబడితేనే హైదరాబాద్ టాప్-2కి వెళ్లే అవకాశం ఉంటుంది.
- పంజాబ్ కింగ్స్ (13 పాయింట్లు)
వరుసగా ఐదు ఓటములతో ఉన్న పంజాబ్ ప్రస్తుతం టాప్-4లో ఉన్నప్పటికీ, వారి భవితవ్యం వారి చేతుల్లో లేదు. వారు గరిష్టంగా 17 పాయింట్లను మాత్రమే చేరుకోగలరు. సిఎస్‌కే లేదా రాజస్థాన్ వరుస విజయాలు సాధిస్తే పంజాబ్‌కు ఇబ్బందులు తప్పవు.
- చెన్నై సూపర్ కింగ్స్ (12 పాయింట్లు)
సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరాలంటే తమ మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఖచ్చితంగా గెలవాలి. అదే సమయంలో ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్లలో కనీసం ఒకటి లేదా రెండు జట్లు పాయింట్లు కోల్పోవాలని కోరుకోవాలి.
- రాజస్థాన్ రాయల్స్ (12 పాయింట్లు)
రాజస్థాన్ తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలవడంతో పాటు, పైన ఉన్న జట్లు తడబడితేనే ముందంజ వేయగలరు.
- ఢిల్లీ క్యాపిటల్స్ (10 పాయింట్లు)
ఢిల్లీ గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. కాబట్టి వారు అన్ని మ్యాచ్‌ల్లో గెలవడమే కాకుండా.. పంజాబ్, చెన్నై, రాజస్థాన్ జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ఆశించాలి. ముఖ్యంగా ఢిల్లీ నెట్ రన్ రేట్ (-0.993) చాలా తక్కువగా ఉండటం వారికి మైనస్.
- కోల్‌కతా నైట్ రైడర్స్ (9 పాయింట్లు)
మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టంతో కూడుకున్న పని. వారు తమ మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి, ఇతర జట్ల ఫలితాలు పూర్తిగా తమకు అనుకూలంగా వస్తేనే అవకాశం ఉంటుంది.
