'సుబ్రమణ్యపురం', 'రాజా రాణి', 'జర్నీ' (ఎంగేయుమ్ ఎప్పోదుమ్) వంటి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ నటుడు జై (Jai) తాను ఇస్లాం మతాన్ని స్వీకరించడంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. అసలు తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మసీదులో తనకు కనిపించిన సమానత్వం, దక్కిన గౌరవమే తన జీవితాన్ని మార్చేశాయని జై పేర్కొన్నారు. తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి జై మాట్లాడుతూ.. తాను గతంలో అన్ని మతాల ఆచారాలను పాటించానని చెప్పారు. శబరిమల యాత్ర కోసం మాల ధరించడం, క్రిస్టియన్ ప్రార్థనలు చేయడం వంటివన్నీ చేసినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే కొన్ని దేవాలయాలలో తనకు ఎదురైన చేదు అనుభవాలు తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను అన్ని దేవుళ్లను నమ్మాను. కానీ ఒకానొక సమయంలో కొన్ని గుడులలో నాకు అవమానాలు ఎదురయ్యాయి. ఊహించని కొన్ని పరిస్థితులు నన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. అలాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే వచ్చాయి అని జై వెల్లడించారు. ఆ తర్వాత 2011లో మొదటిసారి ఒక మసీదును సందర్శించినప్పుడు తనకు సరికొత్త అనుభూతి కలిగిందని జై చెప్పారు.
నేను ఒక నటుడినని అక్కడ ఉన్న అందరికీ తెలుసు. కానీ ప్రార్థన సమయంలో నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు, ఫోటోల కోసం ఇబ్బంది పెట్టలేదు. కేవలం నమాజ్ ముగిసి బయటకు వచ్చాక చాలా మర్యాదగా మాట్లాడారు. అక్కడ ప్రతి ఒక్కరినీ సమానంగా చూడటం నా మనసును బలంగా తాకింది అని వెల్లడించారు. ఇస్లాంను అనుసరించడం ప్రారంభించాక తన ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చిందని జై తెలిపారు.
