ఇరాన్ తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, దేశ పరిపాలనపై నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సిద్ధమైన మెమోలో మొజ్తబా ఖమేనీ తీవ్ర గాయాలతో ఇరాన్‌లోని ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం స్పృహలో లేరని సమాచారం.
56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ తన తండ్రి అలీ ఖమేనీ హత్య అనంతరం సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇటీవల వరకు ఆయనకు చిన్న గాయం మాత్రమే అయ్యిందని వార్తలు వచ్చినప్పటికీ, తాజా మెమో ప్రకారం పరిస్థితి మరింత తీవ్రమైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎలాంటి పరిపాలనా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
అలీ ఖమేనీ మృతదేహాన్ని ఖోమ్ నగరంలో అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అక్కడ పెద్ద సమాధి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులలో మరికొందరిని కూడా అక్కడే సమాధి చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు ప్రకటనలు మాత్రమే వెలువడ్డాయి. అవి కూడా ఆయన ప్రత్యక్షంగా కాకుండా టెలివిజన్ ప్రెజెంటర్లు చదివినవే.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఇరాన్‌కు గడువు విధిస్తూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఒప్పందం కుదరకపోతే దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు జరగవచ్చని అన్నారు. ఇరాన్ 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా దాడులను కొనసాగిస్తూ ఒత్తిడి పెంచుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లో రాజకీయ, భద్రతా పరిస్థితులు అనిశ్చితంగా మారాయి. నాయకత్వం స్పష్టత లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, యుద్ధ పరిస్థితులు అన్ని కలిపి దేశంలో ఉద్రిక్తతను పెంచుతున్నాయి.

