Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెయిల్ వస్తే అదే రోజు రిలీజ్..సుప్రీం సంచలనం

బెయిల్ వస్తే అదే రోజు రిలీజ్..సుప్రీం సంచలనం

హైకోర్టుల్లో తీర్పులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏదైనా కేసులో ఇరువర్గాల వాదనలు ముగిసి ఆర్డర్‌ను రిజర్వ్ (తీర్పును వాయిదా) వేసిన తేదీ నుండి గరిష్ఠంగా మూడు నెలల లోపు ఖచ్చితంగా తీర్పును వెల్లడించాల్సిందేనని దేశంలోని అన్ని హైకోర్టులకు సుప్రీం కోర్టు స్పష్టమైన గడువును విధించింది.

తీర్పుల వెల్లడిలో జరిగే ఆలస్యం వల్ల కక్షదారులు (లిటిగెంట్స్) కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకుంటున్నారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

జార్ఖండ్ హైకోర్టులో ఒక కేసులో తీర్పు వెల్లడి కావడానికి జరిగిన సుదీర్ఘ జాప్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన అనంతరం సుప్రీం కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సూర్య కాంత్ మరియు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి దేశవ్యాప్త న్యాయవ్యవస్థకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం నొక్కి చెప్పింది.బెయిల్ దరఖాస్తులపై మరియు శిక్ష రద్దు పిటిషన్లపై వాదనలు పూర్తయిన అదే రోజు ఆర్డర్లను ప్రకటించాలి. ఒకవేళ బెయిల్ ఆర్డర్‌ను రిజర్వ్ చేయాల్సి వస్తే, ఖచ్చితంగా మరుసటి రోజే దానిని వెల్లడించి, హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

బెయిల్ లేదా శిక్ష రద్దు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆ సమాచారాన్ని జైలు అధికారులకు చేరవేయాలి. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, సదరు ఖైదీని అదే రోజు లేదా అత్యంత గరిష్ఠంగా మరుసటి రోజు లోపు జైలు నుండి విడుదల చేయాలి.హైకోర్టులు తాము ప్రకటించే ప్రతి తీర్పును వెలువరించిన 24 గంటల లోపు తమ అధికారిక వెబ్‌సైట్లలో కచ్చితంగా అప్‌లోడ్ చేయాలి అని సూచించింది.

కోర్టులో తీర్పు యొక్క ప్రధాన భాగం ఏ రోజు అయితే చదివి వినిపిస్తారో.. ఆ తేదీనే తీర్పు వెలువరించిన అధికారిక తేదీగా పరిగణించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశంలో వేలాది మంది ప్రజలు న్యాయం కోసం ఆశ్రయించే ప్రాథమిక సంస్థలు హైకోర్టులు. అక్కడ సకాలంలో తీర్పులు రావడం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుంది. ఈ ఆదేశాలు ఏ న్యాయమూర్తిని లేదా వ్యవస్థను తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశించినవి కావు, కేవలం కాలయాపనను నివారించడానికే అని ధర్మాసనం పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu