Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనా, అమెరికా, భారత్‌ దేశాల నష్టపరిహారం కోరుతున్న నేపాల్‌!

చైనా, అమెరికా, భారత్‌ దేశాల నష్టపరిహారం కోరుతున్న నేపాల్‌!

వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్ర విపత్తులను ఎదుర్కొంటున్న హిమాలయ దేశం నేపాల్‌ తాజాగా ప్రపంచం ముందు ఒక బలమైన ప్రశ్న ఉంచింది. తాము సృష్టించని సంక్షోభానికి తామే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని నేపాల్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ప్రపంచంలో అత్యధిక కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు విడుదల చేస్తున్న చైనా, అమెరికా, భారత్‌ దేశాలు తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాలని నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ స్పష్టం చేశారు.

నేపాల్‌లో గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వాతావరణ మార్పుల వల్ల ఆ దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది. చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. హిమనదీ ప్రాంతంలో మంచు, శిలలు కూలిపోవడంతో భారీగా నీరు, బురద దిగువకు దూసుకొచ్చాయి. ఈ ఘోర విపత్తులో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గల్లంతయ్యారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ముంచెత్తిన ఈ ప్రమాదాన్ని 'క్యాటస్ట్రాఫిక్‌ మౌంటెన్‌ సునామీ'గా మంత్రి ఖనాల్‌ అభివర్ణించారు.

తాము కోరుతున్నది 'సాయం' కాదని, అది 'న్యాయం, పరిహారం' అని మంత్రి తేల్చిచెప్పారు. ఇది దాతృత్వం కాదని, చట్టపరమైన, నైతిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు ఇప్పటికే నేపాల్‌ క్లెయిమ్‌ పంపింది. రాబోయే అంతర్జాతీయ వేదికలపై ఈ గళాన్ని మరింత గట్టిగా వినిపిస్తామని స్పష్టం చేసింది.

గ్లోబల్‌ కార్బన్‌ బడ్జెట్‌ గణాంకాల ప్రకారం.. ప్రపంచ కార్బన్‌ ఉద్గారాల్లో చైనా వాటా 32%, అమెరికా వాటా 13%, భారత్‌ వాటా 8%గా ఉంది. ఈ మూడు దేశాలే కలిపి దాదాపు 53 శాతం ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. కానీ నేపాల్‌ వాటా కేవలం 0.04 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో తక్కువ ఉద్గారాలు విడుదల చేసే దేశాలే తీవ్రంగా నష్టపోతున్నాయన్న వాదనను నేపాల్‌ తెరపైకి తెచ్చింది. భవిష్యత్తులో ఈ 'క్లైమేట్‌ జస్టిస్‌' డిమాండ్‌ అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu