కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో జరుగుతున్న అవినీతి, దోపిడీలను తాము ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, తట్టుకోలేక ముఖ్యమంత్రికి బీపీ (రక్తపోటు) పెరిగిపోతోందని జగన్ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న భవనాల ఖర్చుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతికరమైన గణాంకాలను బయటపెట్టారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పోలుస్తూ చంద్రబాబు ప్రభుత్వ దుబారాను, అవినీతిని ఆయన ఎండగట్టారు. తెలంగాణలో ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం 28 ఎకరాల విస్తీర్ణంలో, దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో అత్యంత ఆధునిక సచివాలయాన్ని నిర్మించింది. దానికి అయిన మొత్తం ఖర్చు సుమారు రూ.615 కోట్లు మాత్రమే అని జగన్ గుర్తుచేశారు.
కానీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నిర్మిస్తున్న 5 సెక్రటేరియట్ బిల్డింగుల ఖర్చు ఇప్పటికే రూ.10,665 కోట్లు దాటిపోతోందని ఆరోపించారు. ఈ ఐదు బిల్డింగులు చాలవన్నట్లు, ఇంకా అదనంగా మరో అసెంబ్లీ బిల్డింగ్, మరో కొత్త హైకోర్టు అంటున్నారని.. ఈ అడ్డగోలు దోపిడీని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
2019 కంటే ముందు చంద్రబాబు నాయుడు ఏ కంపెనీలకు ఏ పనులైతే ఇచ్చారో.. 2024లో అధికారంలోకి రాగానే పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ అవే కంపెనీలకు అవే పనులను కట్టబెట్టారని జగన్ సంచలన ఆరోపణ చేశారు.ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం, 'టైలర్ మేడ్' మరియు రిగ్గింగ్ పద్ధతిలో తమకు అనుకూలమైన కంపెనీలకు టెండర్లు దోచిపెట్టారని విమర్శించారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం, మంత్రం ఏంటో చెప్పాలని నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఆక్రోశం వెళ్లగక్కుతోందని జగన్ అన్నారు.
రాష్ట్రంలో గన్ కల్చర్ పెరుగుతోందంటూ కూటమి నాయకులు చేస్తున్న విమర్శలను జగన్ తీవ్రంగా తిప్పికొట్టారు. గతంలో జరిగిన ఒక వివాదాస్పద ఘటనను ప్రస్తావిస్తూ చంద్రబాబు కుటుంబానికే ఎదురుదాడి లంఘించారు."చంద్రబాబు గారి బావమరిది, వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చి పడేయలేదా? మరి అలాంటప్పుడు అసలైన గన్ కల్చర్ ఎవరిది? ఎవరి ఇంట్లో ఉంది?" అని జగన్ ఘాటుగా ప్రశ్నించారు.
వైసీపీ ప్రతిపాదించిన సరికొత్త విధానం మరియు సిద్ధాంతమైన 'మావిగన్' (MAVIGAN) కు ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోందని, అదే చంద్రబాబు నాయుడి నిద్రను చెడగొడుతోందని జగన్ వ్యాఖ్యానించారు.ప్రజలు తమ వైపు ఉన్నారనే భయంతో, 'మావిగన్'కు సమాధానాలు చెప్పలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము అడుగుతున్న సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక, తన క్యాబినెట్ మంత్రులను అడ్డం పెట్టుకుని బూతులు తిట్టిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ అవినీతిపై తమ పోరాటం మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు.
